Thursday, May 29, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్‌ మరో షాక్‌

ట్రంప్‌ మరో షాక్‌

- Advertisement -

తరగతులకు రాకపోయినా, డ్రాపౌట్‌ అయినా.. వీసా రద్దు
– నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి : భారత, విదేశీ విద్యార్థులకు యూఎస్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌:
అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ ఏదో ఒక షాకింగ్‌ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా, వలసదారులు, అక్కడ విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారు. వారి విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తు న్నారు. స్టూడెంట్‌ వీసాతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, విదేశీ విద్యార్థులకు మరొక ఝలక్‌ ఇచ్చారు. తమతమ కోర్సులకు సంబంధించి తరగతులకు హాజరు కాకపోయినా, డ్రాపౌట్‌ అయినా.. విద్యార్థులు వారి వీసాను కోల్పోయే ప్రమాదమున్నదని యూఎస్‌ తాజా హెచ్చరికలు పంపింది. భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ ఈ మేరకు ప్రకటన చేసింది. ”మీ విద్యాసంస్థకు తెలియజేయకుండా డ్రాపౌట్‌ అయినా, తరగతులకు డుమ్మా కొట్టినా, స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా.. మీ స్టూడెంట్‌ వీసా రద్దు అవ్వొచ్చు. అలాగే, భవిష్యత్తులో యూఎస్‌ వీసాలకు మీరు అర్హతను కోల్పో వచ్చు. ఎప్పుడూ మీ వీసా నిబంధనలను పాటించండి. ఎలాంటి సమస్యలూ రాకుండా మీ విద్యార్థి స్థితిని కొనసాగించండి” అని తన అధికా రిక ప్రకటనలో అమెరికా రాయబార కార్యాలయం పేర్కొన్నది. అక్రమ వలసదారుల పేరిట వారిని అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం ఈ ఏడాది మొదట్లో పెద్ద ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను హెచ్చరిస్తూ తాజా ప్రకటన రావటం గమనార్హం.
విద్యార్థులకు ఇప్పటికే అనేక వార్నింగ్‌లు
అమెరికాలోని ట్రంప్‌ యంత్రాంగం అక్కడి కొన్ని యూనివర్సిటీలు, విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నది. ఇప్పటికే వారికి అనేక వార్నింగ్‌లు ఇచ్చింది. యూఎస్‌లో ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) వీసాల విషయంలో ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌కు యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఈనెల ప్రారంభంలోనే హెచ్చరికలు పంపింది. విద్యార్థుల ఓపీటీ ప్రారంభమైన తర్వాత 90 రోజుల్లో వారు తమ ఎంప్లారుమెంట్‌ను నివేదించటంలో విఫలమైతే.. స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సెవిస్‌)లో వారి చట్టపరమైన హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. అలాగే, వీసా రద్దు కాకుండా ప్రమాదాన్ని నివారించటం కోసం యూఎస్‌ బయట ట్రావెల్‌ చేయటంపై ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ను యూఎస్‌లోని అనేక కాలేజీలు ఇప్పటికే హెచ్చరించాయి.

యూఎస్‌ నుంచి 682 మంది భారతీయులు తరలింపు

గడువుకు మించి యూఎస్‌లో ఉంటే వెళ్లిపోవాలనీ, లేకపోతే బహిష్కరిస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం భారతీయ వలసదారులను ఈ నెల ప్రారంభంలో ఆదేశించిన విషయం విదితమే. భవిష్యత్తులో అమెరికాకు రాకుండా ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తామనీ హెచ్చరించింది. హెచ్‌-1బీ వీసా, స్టూడెంట్‌ వీసా, టూరిజం వీసాపై ఉన్న భారతీయ వలసదారులకు ఈ హెచ్చరికను పంపింది. పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నం దుకు, ఇతర కారణాలతో కొందరు విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చిన విషయం విదితమే. డోనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరణ ఆదేశాల్లో భాగంగా యూఎస్‌.. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 700 మంది భారతీయులను న్యూఢిల్లీకి పంపించేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం… యూఎస్‌ నుంచి 682 మంది భారతీయులు తరలించబడ్డారు. ఇందులో అక్రమంగా ప్రవేశించినవారే అధికం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -