– పెన్షన్ రూ.6వేలకు పెంచాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
– మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
– సమస్యలు పరిష్కరిస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ
నవతెలంగాణ-మెదక్‌టౌన్
ప్రతి వికలాంగునికీ అంత్యోదయ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట 24 గంటల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వికలాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2016 ఆర్‌పీడీ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఎలాంటి షరతులూ లేకుండా రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టంలో వికలాంగులందరికీ జాబ్ కార్డు జారీ చేసి, 150 రోజులు పని కల్పించాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో ఉన్న ఏడుపాయల దేవస్థానం, మెదక్ చర్చి పరిధిలో షాపింగ్ కంప్లెక్స్‌లు వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అడిషనల్ కలెక్టర్ సమక్షంలో చర్చలు
ధర్నా సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ ప్రతినిధులతో జిల్లా అధికారులు అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, డీడబ్ల్యూఓ హైమావతి సమక్షంలో చర్చించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నా శిబిరం దగ్గరకు డీడబ్ల్యూఓ హైమావతి వచ్చి చర్చల వివరాలను వివరించారు.
సమస్యలు పరిష్కరిస్తాం :అడిషనల్ కలెక్టర్ హామీ
జిల్లాలో వికలాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ హామీ ఇచ్చారు. వికలాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై డిపార్ట్‌మెంట్ వారికి లెటర్స్ పంపించామని, వారి నుంచి సమాధానం రాగానే జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ మెదక్ జిల్లా అధ్యక్షులు ముత్యాలు, కార్యదర్శి కె.యశోద, జిల్లా ఉపాధ్యక్షులు టి.యాదగిరి, కవిత, కిష్టయ్య, శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్, దుర్గ, సామెందర్, కిష్టయ్య, మెదక్ పట్టణ కన్వీనర్ శ్రీదేవి, కో కన్వీనర్ మున్నా, వెంకట్, మునీర్, వికలాంగులు పాల్గొన్నారు.
వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES