Friday, March 13, 2026
E-PAPER
HomeNewsముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ..భారీగా భూ కేటాయింపులు

ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ..భారీగా భూ కేటాయింపులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జల జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, కడప స్టీల్ ప్లాంట్‌కు భూ కేటాయింపులు, గిరిజన రైతులకు సబ్సిడీలు, మహిళల కోసం హాస్టళ్లు వంటి అనేక ముఖ్యమైన ప్రతిపాదనలను ఆమోదించారు. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు
రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని పలు గ్రామాల్లో 424.45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.21.30 కోట్ల చెల్లింపుపై ఈ భూమిని ఏపీఐఐసీకి బదలాయించనున్నారు. రెండేళ్లలో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

వీటితో పాటు కిమ్స్ ఆస్పత్రికి 2 ఎకరాలు, సంబంధిత ట్రస్టుకు 23 ఎకరాలు, తుళ్లూరు ఎడ్యుకేషన్ సొసైటీకి 3 ఎకరాలు పరిహారంగా కేటాయించారు. బాపట్ల జిల్లాలో లగ్జరీ రిసార్టుల కోసం ఏపీ టూరిజం అథారిటీకి 17 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి 20 ఎకరాలు, నెల్లూరులో ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి ఎకరం భూమిని కేటాయించారు. ముత్తుకూరులో సింగపూర్ కంపెనీ సీఎస్ఆర్ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న ఆసుపత్రి కోసం 86 సెంట్ల భూమిని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు నిర్ణయించారు.

గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీ
దాత్రి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్‌లో భాగంగా 8 గిరిజన జిల్లాల్లోని అటవీ హక్కు పత్రాలు (ఎఫ్ఆర్ఏ) ఉన్న రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్‌పై 100 శాతం, స్ప్రింక్లర్లపై 90 శాతం సబ్సిడీని శాచురేషన్ పద్ధతిలో అందించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొండ ప్రాంతాల్లో సాగు చేసే గిరిజనులకు నీటి వనరుల సమస్యను అధిగమించి, అధిక దిగుబడులు సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను 54 శాతానికి పెంచుకోవడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి వివరించారు.

ఉద్యోగినుల కోసం ‘సఖీ నివాస్’ హాస్టళ్లు
మిషన్ శక్తి పథకం కింద రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే మహిళల కోసం ‘సఖీ నివాస్’ పేరుతో 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సురక్షితమైన వసతితో పాటు, చిన్న పిల్లలున్న తల్లుల సౌకర్యార్థం ఈ హాస్టళ్లలో క్రెష్ (శిశు సంరక్షణ కేంద్రం) సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. ఉద్యోగినులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో హాస్టల్ నిర్వహణకు 8 మంది సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారు.

వ్యాపారులకు జీఎస్టీ ట్రైబ్యునల్స్
జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు, వ్యాపారులకు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని అప్పీళ్లను విజయవాడలోనే విచారిస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో మూడు అప్పిలేట్ ట్రైబ్యునల్ కార్యాలయాలను నోటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల కేసులు త్వరగా పరిష్కారమై రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా సకాలంలో అందుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -