చాలామంది క్షమాపణ చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ చిన్న సారీ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మనలోని అనవరమైన భయాలను, ఆందోళనను, తప్పు చేశామనే భావనను దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు క్షమాపణలు అడగడానికి ఎలాంటి భేషజాలకూ పోవాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు తెలిసో తెలియకో కారణం ఉన్నా లేకపపోయినా మన స్నేహితులను, కుటుంబ సభ్యులను కోప్పడుతుంటాం. వారిని మాటలతో, చేతలతో బాధపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఆ సమయంలో కోపంలోనో, బాధలోనో మీరు చేసేది సరైందే అనిపించవచ్చు. అయితే కొంత సమయం గడచిన తర్వాత ‘నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది’ అని పదే పదే అనుకుంటుంటాం. ఇక తప్పు చేశామనే అపరాధ భావం మనల్ని పట్టి పీడిస్తుంటుంది. పోనీ వారి దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుదామంటే మనసొప్పదు. ఇలా బాధపడటం వల్ల మన మనసూ కుదుటపడదు. అందుకే ఈ అపరాధ భావన నుండి బయటపడి తిరిగి మామూలుగా మారాలి. అప్పుడే ప్రశాతంగా మన పనులపై మనం దృష్టి పెట్టగలం.
చాలా మంది ఏదైనా పొరపాటు చేసినప్పుడో లేదా వివిధ కారణాల వల్ల ఇతరులపై కోపం ప్రదర్శించినప్పుడో తప్పు చేశామనే భావనలోకి వెళ్లిపోతుంటారు. అయితే ఇలా బాధపడే ముందు అసలు మనం చేసింది తప్పా? ఒప్పా? అని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావంతో మనపై మనం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే పొరపాటు చేయొచ్చు. కాస్త ప్రశాంతంగా ఆలోచించడం వల్ల పొరపాటు ఎక్కడ చేశామో తెలుస్తుంది. అప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే మనలో ఉన్న అపరాధ భావన తొలగిపోతుంది.
ఏదైనా పొరపాటు జరిగినప్పుడు చాలామంది దాన్ని పదేపదే తలచుకుంటూ బాధపడుతుంటారు. కొన్నిసార్లు జరిగింది చిన్న సంఘటనే అయినా దానివల్ల పెద్దగా నష్టమేమీ జరగకపోయినా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ తలుచుకుంటూ బాధపడిపోతుంటారు. అయితే చిన్న విషయాలకు కూడా ఇలా అతిగా ఆలోచించడం వల్ల మనసు తప్పు చేశామనే భావనతో నిండిపోతుంది. దీనివల్ల మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తపడడం మంచిది.
కొన్ని సార్లు అకారణంగా ఎవరినైనా నిందించినా లేదా దూషించినా వారి కంటే మనమే ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. కానీ వారి ముందు ఆ భావాలను బయటపెట్టలేం. అందుకే వారి ముందుకు వెళ్లడానికి కూడా సాహసించం. మరికొందరైతే కేవలం వారితోనే కాకుండా వారికి సంబంధించిన వారితోనూ స్నేహపూర్వకంగా మెలగలేరు. దీంతో అవనసరంగా నోరు పారేసుకున్నామనే భావన ఇంకా ఎక్కువైపోతుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే ఆ భారాన్ని దించేసుకోవడం మంచిది. దీనికోసం మీరు ఎవరిని దూషించారో వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ అడగండి. నిత్యం బాధపడుతూ కుమిలిపోవడం కంటే ఇలా సారి చెప్పడం చాలా ఉత్తమం. అసలు ఏ పరిస్థితుల్లో అప్పుడు అలా చేయాల్సి వచ్చిందో వారికి వివరించండి. అలాగే జరిగిన సంఘటనను మళ్లీ పునరావృతం చేయనని వారికి హామీ ఇవ్వండి. అప్పుడు పెద్ద మనసుతో వారే మిమ్మల్ని మన్నించేస్తారు. మీ మనసు కూడా తేలికపడుతుంది.
క్షమాపణ
- Advertisement -
- Advertisement -