నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: ఓపెన్ టెన్త్, ఇంటర్ (2025–26)లో చదవడానికి ఆసక్తి గలవారు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ మరియు ఇంటర్ విధానం ద్వారా విద్యను కొనసాగించడం వల్ల చదువును మధ్యలో ఆపివేసిన వారికి, ఉద్యోగులు, గృహిణులు, లేదా ఇతర బాధ్యతల కారణంగా సాధారణ పాఠశాలలకు హాజరుకాలేకపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని అన్నారు.
టాస్ తెలంగాణ ఓపెన్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ (2025-26) విద్యా సంవత్సరానికి జిల్లాలో 1780 మందికి అవకాశం కల్పించగా, ఇప్పటివరకు కేవలం 1065 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థులు 2025 అక్టోబర్ 23వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అన్నారు. జిల్లాలోని 17 సెంటర్లలో (పాఠశాలలు, కళాశాలల్లో) దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించబడిందని, విద్యార్థులు సమయానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుందని,విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేయాలని సూచించారు.టాస్ ద్వారా ఇచ్చే సర్టిఫికెట్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం అలాగే ఉన్నత విద్యకు కూడా సమానంగా ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.