నవతెలంగాణ-హైదరాబాద్: శిక్షణ పొందిన సర్వేయర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలుఅందజేశారు. ఈ సందర్బంగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద సీఎం విమర్శలు గుప్పించారు. BRS తెచ్చిన ధరణి చట్టం.. కొందరికి చుట్టంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆధిపత్యం చెలాయించాలని చూశారు. గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి చట్టమే. అధికారంలోకి రాగానే ధరణి భూతాన్ని వదిలించాం. భూ సమస్యలు పరిష్కరించాలనే లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకొచ్చాం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. ఇచ్చినా పరీక్షలు పెట్టలేదు.
ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. గత ప్రభుత్వ హయాంలో TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. అధికారంలో రాగానే TGPSCని ప్రక్షాళన చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి ఆపాలని చూశారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం.’ అని సీఎం రేవంత్ తెలిపారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్లేందుకు మీ సహకారం ఉండాలి. రైతే దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుకు అండగా ఉండండి. తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి.’ అని సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఎంపికైన సర్వేయర్లకు దిశానిర్దేశం చేశారు.