Friday, May 16, 2025
Homeజాతీయంపాక్‌ అణ్వాయుధాలు భద్రంగా వున్నాయా?

పాక్‌ అణ్వాయుధాలు భద్రంగా వున్నాయా?

- Advertisement -

– అంతర్జాతీయ పర్యవేక్షణ అవసరమన్న రాజ్‌నాథ్‌ సింగ్‌
శ్రీనగర్‌:
ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్తాన్‌ అణ్వాయుధాల భద్రతను ఆయన ప్రశ్నించారు. వాటిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఇఏ) పర్యవేక్షణ వుండాలని కోరారు. పాక్‌ నిర్లక్ష్యపూరితమైన వ్యవహార శైలి పట్ల ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని బాదామి బాగ్‌ కంటోన్మెంట్‌లో సైనికులనుద్దేశించి సింగ్‌ మాట్లాడారు. అమరులైన సైనికులకు రాజ్‌నాథ్‌సింగ్‌ శ్రీనగర్‌లో నివాళులర్పించారు. పాకిస్తాన్‌ అణు బ్లాక్‌ మెయిలింగ్‌కు తామెన్నటికీ లొంగేది లేదన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న భారత్‌ కృత నిశ్చయాన్ని పాకిస్తాన్‌ బాధ్యతారాహిత్యంగా చేసే అణు బెదిరింపులు ఏ రకంగానూ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈ దశలో అంతర్జాతీయ సమాజాన్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా -అసలు అటువంటి బాధ్యత లేని దేశం చేతిలో అణ్వాయుధాలు సురక్షితమేనా అని ప్రశ్నించారు. ”ఉగ్రవాదులు వారి ధర్మం ప్రకారం భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి కర్మ ప్రకారం మనం వారిని లక్ష్యంగా చేసుకున్నాం, వారిని తుదముట్టించడం మన ధర్మమని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.
సైనిక బలగాలతో ముచ్చటించిన రక్షణమంత్రి, ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులను కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామీ బాఫ్‌ు కంటోన్మెంట్‌ వద్ద భారత్‌ విధ్వంసం చేసిన పాక్‌ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు. వెంట జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కూడా వున్నారు.
బారాముల్లాలో ఆర్మీ చీఫ్‌ పర్యటన
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు ప్రాంతాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. నిరంతరం అప్రమత్తంగా వుండాల్సిందిగా ఆయన సైనికబలగాలను కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో వాస్తవాధీన రేఖ పొడవునా పై చేయి సాధించిన మన బలగాల ధైర్య సాహసాలను ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -