Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆశయాలకు ఆంక్షలు అడ్డంకులా?

ఆశయాలకు ఆంక్షలు అడ్డంకులా?

- Advertisement -

దశాబ్దాల దిగ్బంధనాలను ఎదుర్కొంటూనే ముందుకు…
ఎన్ని ఆంక్షలు, దిగ్బంధనాలు ఎదురైనా పోరాడతామని, తమ ఆశయ పథం నుంచి అంగుళమైనా వెనుకడుగు వేయబోమని క్యూబా ప్రజలు తమ చేతలతో చాటుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం క్యూబా. 1959లో కాస్ట్రో నాయకత్వంలోని కమ్యూనిస్టు పాలన ప్రారంభమైంది. 1960 నుంచే క్యూబాపై ఆంక్షలు, దిగ్భంధనాలు ప్రారంభమయ్యాయి. అవి ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తున్నాయి. క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో సోవియట్‌ యూనియన్‌, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్దం తీవ్రస్థాయిలో ఉన్న దశలో కమ్యూనిస్టు దేశమైన క్యూబా సహజంగానే సోవియట్‌ యూనియన్‌ వైపున ఉండేది. తన సమీప దేశమైన క్యూబా తన ప్రత్యర్థి పక్షంలో ఉండటం అమెరికాకు కంటగింపైంది. ఇక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని తొలగించడానికి కుట్రలతోపాటు, వివిధ రకాలైన ఆంక్షలను, దిగ్భంధనాలను క్యూబా మీద అమెరికా ప్రయోగించింది. 1990వ దశకంలో క్యూబా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. క్యూబా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. పర్యాటకం, నైపుణ్యం కలిగిన కార్మికులు, చక్కెర, పొగాకు, కాఫీ ఎగుమతులు.. వంటి అంశాలపై క్యూబా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అక్షరాస్యత విషయంలో లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ల్లోని ఇతర దేశాల కంటే క్యూబా మెరుగ్గా ఉంది. దేశానికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. ఇలాంటి వాటితో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూ క్యూబా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ఆయుధాల నిషేధంతో ఆంక్షలు ప్రారంభం
క్యూబాపై ప్రస్తుతం అన్ని రకాల ఆంక్షలు, దిగ్బంధనాలతో విరుచుకుపడుతున్న అమెరికా వీటిని ముందుగా ఆయుధాల నిషేధంతో ప్రారంభించింది. 1958లో అప్పటి అమెరికా ప్రభుత్వం క్యూబాపై తొలిసారిగా ఆయుధాల నిషేధాన్ని విధించింది. తరువాత 1960లో క్యూబా ఇంధన, వ్యవసాయ రంగాలను లక్ష్యంగా చేసుకుంది. 1960 మార్చిలో ఏకంగా క్యూబా ప్రజలు, సైనిక లక్ష్యాలపై దాడులకు కూడా పాల్పడింది. ఇదే ఏడాది అక్టోబర్‌లో క్యూబా ప్రభుత్వం చమురు శుద్ధి కర్మాగారాలతోసహా అమెరికన్‌ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం అమెరికా మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆహారం, ఔషధాలతో సహా క్యూబా వాణిజ్యంపై పూర్తి నిషేధం విధించింది. ఒకవైపు క్యూబాపై ఆంక్షలు విధిస్తూనే.. మరో వైపు ఆ దేశం తీవ్రవాదానికి మద్దతు ఇస్తోందంటూ తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. దీన్నే క్యూబన్‌ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ మధ్యకాలంలో ఆంక్షలు కాస్త సడలించినట్లు కనిపించినా.. తరువాత అమెరికా మళ్లీ వీటిని తీవ్రతరం చేసింది. క్యూబాపై అమెరికా ఆంక్షలను ప్రపంచ సమాజం, ఐరాస తీవ్రంగా ఖండిస్తున్నాయి. క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయాలని ఐరాస అనేకసార్లు తీర్మానం చేసింది. అయినా అమెరికా వీటిని కొనసాగిస్తూనే ఉంది.
ఆంక్షలతో విద్యుత్‌ సంక్షోభం, ఆహార కొరత
అమెరికా ఆంక్షల కారణంగా క్యూబా విద్యుత్‌ సంక్షోభాన్ని, ఆహార కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో 40 శాతం కుటుంబాలు తగినంత ఆహారం లేకపోవడం లేదా పోషకాహార సమస్యను ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ ఇటీవల ఒక నివేదికలో తెలిపింది. ఇంధనలపై ఆంక్షల కారణంగా క్యూబా తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గత మూడు నెలలుగా క్యూబాపై కఠినంగా ఇంధన దిగ్భంధనాన్ని అమెరికా అమలు చేస్తోంది. దీంతో క్యూబాలో ప్రతీ సమాజం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అత్యంతవసరమైన శస్త్రచికిత్సలను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితులు అనుభవిస్తున్నారు. విద్యుత్‌ కోతలు సర్వసాధారణం. చాలా పరిమితంగానే విద్యుత్‌ సరఫరా ఉంటుంది. అయినా సరే అనేకసార్లు దేశవ్యాప్త విడ్యుత్‌ షట్‌డౌన్‌కు క్యూబా గురైంది. విద్యుత్‌ సమస్య కారణంగా ప్రజలకు తాగునీటి సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న క్యూబా ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అమెరికా ముందు తలవంచడానికి సిద్ధంగా లేమని క్యూబా ప్రజలు ప్రతినబూనుతున్నారు.

ద వై.విశ్వప్రసాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -