రాయపోల్ ఎస్ఐ కుంచం మానస..
నవతెలంగాణ – రాయపోల్
బతుకమ్మ, దసరా పండగ సెలవులతో అనేక కుటుంబాలు సొంత ఊరికి, బందువుల గ్రామాలకు వెళ్తుంటారు ఇలాంటి తరుణంలో ఇళ్లలో చోరీలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే పాఠశాలలకు పండగ సెలవులు మొదలయ్యాయి. ఈ నెల 28 నుంచి కళాశాలలకు కూడా సెలవులు వస్తుండడంతో ఆయా కుటుంబాలు బంధువుల ఇంటికి ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మళ్లీ అక్టోబరు 3 తర్వాతనే ఆయా కుటుంబాలు తిరిగి రానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాళం వేసి ఉండే ఇండ్లే లక్ష్యంగా చోరీలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
పోలీసుల సూచనలివి..
-ప్రజలు ఊరికి వెళ్తున్నప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తద్వారా ప్రాంతంలో గస్తీ పెంచుతాం.
-బంగారు నగలు, నగదును ఇంట్లో పెట్టి వెళ్లొద్దు. వాటిని బ్యాంకు లాకర్ లో కానీ నమ్మకం ఉన్నవారి వద్ద ఉంచండి. వీలైతే వెంట తీసుకెళ్లండి.
-ఇంటి ప్రధాన ద్వారం తాళం కనిపించకుండా డోర్ కటన్ ఏర్పాటు చేసుకోవాలి.
-ప్రతి ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
– అల్మారా, బీరువా తాళాలను పాదరక్షల స్టాండ్, పరుపులు, దిండ్లకింద కాకుండా రహస్య ప్రదేశంలో ఉంచండి.
-ఊరెళ్లి తిరిగొచ్చే వరకు రోజు ఇరుగు, పొరుగు వారిని అడిగి ఇంటి వివరాలు తెలుసుకోవాలి.
-అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
– ఇలాంటి జాగ్రత్తలు పాటించడం దొంగతనాలు నేరాలు జరగకుండా రక్షించుకోవచ్చని ఎస్ఐ తెలిపారు.