నవతెలంగాణ-హైదరాబాద్: చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగాల్లో కీలకమైన ‘ఆర్టెమిస్-2’ యాత్ర వాయిదా పడింది. ఫ్లోరిడాలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా … ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 8వ తేదీకి మార్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది. తొలుత ఈ ప్రయోగాన్ని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫిబ్రవరి 6న చేపట్టాలని నిర్ణయించారు.
తీవ్ర చలిగాలులు ..!
ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలులు, గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. ”వాతావరణ పరిస్థితుల కారణంగా ఆర్టెమిస్-2 రాకెట్‌లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం నాడు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ మార్పుతో ప్రయోగానికి సాధ్యమయ్యే తొలి తేదీ ఫిబ్రవరి 8న అవుతుంది. ఇంధనం నింపే ప్రక్రియను సమీక్షించిన తరువాత తుది ప్రయోగ తేదీని ఖరారు చేస్తాం” అని నాసా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపింది.
ఆర్టెమిస్-2 యాత్రకు నలుగురు వ్యోమగాములు …
ఆర్టెమిస్-2 యాత్రలో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి వస్తారు. వ్యోమగాముల బఅందం ప్రస్తుతం హ్యూస్టన్‌లో క్వారంటైన్‌లో ఉంది. మరోవైపు ఇంజనీర్లు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పవర్ ఆన్‌లో ఉంచి, చల్లని ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు హీటర్లను కాన్ఫిగర్ చేశారు.
2027లో 10 రోజులపాటు సాగే యాత్ర …!
10 రోజుల పాటు సాగే ఈ యాత్ర, 2027లో చేపట్టనున్న ఆర్టెమిస్-3 మిషన్‌కు మార్గం సుగమం చేస్తుంది. ఆర్టెమిస్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా మనిషి అడుగుపెట్టనున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం 1972లో అపోలో-17 మిషన్ తర్వాత మానవులతో చేపడుతున్న చంద్రుడి యాత్ర ఇదే కావడం విశేషం. ఈ బఅందంలో కమాండర్ రీడ్ వైస్‌మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ ఉన్నారు.



