– మద్దతు ప్రకటించిన సీపీఐ(ఎం) జిల్లా నేత పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
హాస్టల్, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం సమ్మె శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రారంభించారు. జేఏసీ నాయకులు బైట నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన సభలో పుల్లయ్య మాట్లాడుతూ.. హాస్టల్లో ఆశ్రమ పాఠశాలలో వండి పెడుతున్న కార్మికుల శ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని వీరు ప్రతిరోజు సకాలంలో శుభ్రతగా వంటలు నిర్వహణ చేసిన ఫలితంగా నే ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అన్నారు.
అమ్మ తర్వాత అమ్మ లాగా విద్యార్థులను తమ బిడ్డల్లా గా చూసుకునే డైలీ వేజ్ కార్మికుల సమస్యలు పాలక ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుత పాలకులు గెలిచే వరకు కార్మికుల దగ్గర ఒక మాట మాట్లాడి గెలిచిన తర్వాత కార్మికుల కు వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నప్పటికీ కార్మికుల వైపు మాట్లాడకపోవడం ఏమిటని అన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే చరిత్రలో ఆందోళన పోరాటాలు చేసి అంతిమంగా కార్మికులే విజయం సాధించారని ఆ స్ఫూర్తితో డైలీ పేజ్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కొరకు అలుపెరుగని పోరాటాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి కామయ్యపాలెం రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి,మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్,నాయకులు మురహరి రఘు, భక్తుల శ్రీను, నాగమణి, రామలక్ష్మి,అప్పారావు కరుణాకర్, లక్ష్మి, రాజు,దాసు తదితరులు పాల్గొన్నారు.