Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలునీటి వాటాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

నీటి వాటాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

- Advertisement -

– తేదీ ఖరారు చేసుకొని స్పీకర్‌కు కేసీఆర్‌ లేఖ రాయాలి
– ఆధారాలన్నీ సభ ముందుంచుతా
– తెలంగాణ ద్రోహులు…గోదావరి దొంగలెవరో తేలుద్దాం
– ఆయనిచ్చిన బోడి సలహాలతోనే రాష్ట్రానికి దరిద్రం : రైతు నేస్తం సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గోదావరి, కృష్ణా నదీజలాల్లో రాష్ట్రవాటాల విషయంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఈ చర్చలో భాగస్వామి కావాలని సవాలు విసిరారు. ‘ఆయనకు వీలైన రోజు అసెంబ్లీని సమావేశపర్చమని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయాలనీ, ఆ రోజు అన్ని ఆధారాలను సభ ముందు ఉంచి చర్చిస్తామన్నారు. బనకచర్లపై బీఆర్‌ఎస్‌ బండారాన్ని బయటపెడతామని చెప్పారు. ఒకరోజు గోదావరిపై, మరోరోజు కృష్ణా నదీ జలాల వాటాలపై చర్చిద్దామన్నారు. మంగళవారం నాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ”గోదావరి జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసిందెవరు? కోట్లాది రూపాయలు దోచుకున్నదెవరు? 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయనీ, రాయలసీమకు తరలించుకోమని కేసీఆర్‌ చెప్పాకే, 2016లో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. హంద్రీనీవాకు 400 టీఎంసీలు తరలించేందుకు 2016లో ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌, జీవో, 2018లో వాప్కోస్‌ సంస్థ నియామకం జరిగాయని వివరించారు. కేసీఆర్‌ ఇచ్చిన బోడీ సలహాలు, దిక్కుమాలిన సూచనలతోనే రాష్ట్రానికి దరిద్రం దాపురించిందని ఘాటుగా విమర్శించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 800కు పైగా టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే, 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన కేసీఆర్‌, వాటిని కూడా పూర్తిగా వాడుకోకుండా తెలంగాణ రైతాంగానికి శాశ్వతంగా మరణశాసనం రాశారని చెప్పారు. దీనికి సంబంధించిన సంతకాలు, ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తానన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పేంటో సభలో కేసీఆర్‌ నిరూపించాలని సవాలు విసిరారు. పదేండ్లలో ధనిక రాష్ట్రం దివాళా తీస్తే, కేసీఆర్‌ కుటుంబం ఏ విధంగా శ్రీమంతులయ్యారో చెప్పాలని నిలదీశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.2 లక్షల కోట్లను కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, ఉమ్మడి రాష్ట్రంలో మొదలెట్టిన ప్రాజెక్టులేవి పూర్తి చేయలేదని విమర్శించారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి తెలంగాణను ఎడారిగా మార్చారన్నారు. 18 నెలల కాలంలో కాంగ్రెస్‌ పాలనలో రూ.ఒక లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్‌, స్ప్రింక్లర్లు, సోలార్‌ గిరి వికాసంలో పంపుసెట్లు, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు బోనస్‌, రైతు రుణమాఫీ సహా అన్నీ అమలు చేశామన్నారు. అభివృద్ధిలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ, వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఎలక్ట్రిక్‌ బస్సులు, పెట్రోల్‌ బంకులకు యాజమాన్య హక్కులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, ఐకేపీ ద్వారా 8 వేల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు వంటి అనేక స్కీంలను అమల్లోకి తెచ్చామని వివరించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన, 18 నెలల కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేసుకుంటూ ప్రజలు చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. రైతుభరోసా పంపిణీ పూర్తయ్యిందని 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. చంద్రబాబు కోసం తాను బనకచర్లకు గోదావరి నీళ్లను ఇస్తున్నట్టు విష ప్రచారం చేస్తున్నారనీ, ఉండాలనుకుంటే తాను అక్కడే ఉండేవాడినన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి అండగా ఉండాలనే కాంగ్రెస్‌లో చేరానని వివరణ ఇచ్చారు. సోనియాగాంధీ కాళ్లు మొక్కి, కడుపులో తలపెట్టి, నట్టేట ముంచిన చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రులంతా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -