– 82 కిలోమీటర్ల పొడవునా పంట కాల్వలు
– సీసీ లైనింగ్, ఇతర పనులకు రూ.1680 కోట్లు
– పనులు మొదలై తొమ్మిది నెలలైనా జంగిల్ కట్టింగ్‌కే పరిమితం
– మరమ్మతుల పేర ఇప్పటికే మూడు పంటలకు క్రాప్ హలిడే
– వర్షాలు పడితే సీసీ పనులకు ఆటంకం
– నాణ్యతాలోపంతో పనులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మెతుకుసీమ పాత మెదక్ జిల్లాకు జీవనాధారంగా ఉన్న సింగూర్ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం కొనసాగుతోంది. సాగు, తాగునీటి అవసరాలతో పాటు జల విద్యుత్ కోసం బహుళార్దసాధక ప్రాజెక్టుగా దీన్ని నిర్మించారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ మూడు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రాజెక్టు కాల్వలు పూడిపోయి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాల్వల మరమ్మతులు, జంగిల్ కటింగ్, సపోర్ట్ వాల్స్, సీసీ లైనింగ్ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమై తొమ్మిది నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి కనిపించట్లేదు. కాల్వ కట్టలపై చెట్ల తొలగింపు పనులు తప్ప ముఖ్యమైన సీసీ లైనింగ్, బెడ్ వర్స్ ప్రారంభం కాలేదు. మరో రెండు వారాలైతే వానాకాలం వర్షాలు పడనున్నాయి. వర్షాకాలంలో సీసీ లైనింగ్ పనులు చేయడానికి ఆటంకం ఏర్పడే అవకాశమున్నా పనుల్లో వేగం పెంచడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం రైతులకు శాపంలా మారుతోంది. వానాకాలం సాగుకైనా నీటిని విడుదల చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి.
సంగారెడ్డి జిల్లా సింగూర్ గ్రామంలో మంజీరా
నదిపై నిర్మించిన సింగూర్ డ్యామ్ నిర్మాణ పనులు 1979లో చేపట్టగా.. పదేండ్లలోనే పూర్తి చేసుకొని ప్రారంభించారు. 33 మీటర్ల ఎత్తు, 7520 మీటర్ల పొడువు, 17 స్పిల్‌వే గేట్లు, 8.16 లక్షల క్యూసెక్కుల స్పెల్‌వే డిశ్చార్జి, 29.917 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టు ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు 15 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మితమైంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
82 కిలో మీటర్ల ప్రధాన పంట కాల్వలు
సింగూర్ ప్రాజెక్టు కింద స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా కుడి, ఎడమ కాల్వలతో పాటు డిస్టిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి. ప్రాజెక్టు కింద పాత ఆయకట్టు 40 వేల ఎకరాలతో పాటు కొత్తగా మరో పది వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టు కింద 82 కిలో మీటర్ల పంట కాల్వలున్నాయి. సింగూర్ ప్రాజెక్టు నుంచి అందోల్ నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, చౌటకూర్, మునిపల్లి మండలాలతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలోని గ్రామాలకూ సాగునీరు అందుతుంది. ఈ కాల్వలకు ప్రతి ఏటా 2 టీఎంసీలను సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి అందోల్ వరకు 24 కిలో మీటర్ల పొడవైన మెయిన్ కెనాల్ నిర్మించారు. దీనికి అనుబంధంగా పుల్కల్ మండలంలోని సింగూర్ నుంచి చౌటకూర్ మండలంలోని శివంపేట వరకు 24 కిలో మీటర్ల పొడవైన ఎడమ కాల్వ ఉంది. మునిపల్లి మండలంలోని బస్వారెడ్డిపల్లి నుంచి సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ వరకు 12 కిలో మీటర్ల మేర కుడి కాల్వకు నీరందుతాయి. ఎడమ, కుడి కాల్వల పరిధిలో 22 కిలో మీటర్ల పొడవైన డిస్టిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి.
రూ.1680 కోట్ల వ్యయంతో మరమ్మతులు
సింగూర్ ఎడమ, కుడి కాల్వలతో పాటు డిస్టిబ్యూటరీ కెనాల్స్ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1680 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. సింగూర్ కాల్వ కట్టల వెంట దట్టమైన చెట్ల పొదలు పెరిగాయి. కాల్వ అడుగు భాగంగా చెట్లు పెరగడమే కాకుండా వర్షాలకు కాల్వ కట్టల మట్టి కొట్టుకుపోయింది. ప్రధాన కాల్వలు, డిస్టిబ్యూటరీలకు విడుదల చేసిన నీరు కింది వరకు ప్రవహించకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందకపోయేది. అనేక చోట్ల గండ్లు పడేది. దాంతో కాల్వలకు శాశ్వత మరమ్మతులు చేయాలని రైతులు డిమాండ్ చేయడంతో రూ.1680 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 82 కిలో మీటర్ల పొడవున్న ప్రధాన కాల్వలకు, డిస్టిబ్యూటరీ కెనాల్స్‌కు జంగిల్ కటింగ్, సపోర్ట్ వాల్స్ ఏర్పాటు, పుల్ లెవల్లో నీటి ప్రవాహం ఉండేలా సీసీ లైనింగ్ పనులు చేయాల్సి ఉంది.
పనులు సాగవు.. పొలాలు తడవవు..
సింగూర్ కాల్వలకు చేపట్టిన మరమ్మతుల పనులు ముందుకు సాగట్లేదు. సదరు కాంట్రాక్టు సంస్థ ఏడాదిన్నర కాలంలో పనులు పూర్తి చేయాలని ఒప్పందముంది. ఇందుకోసం ప్రాజెక్టు కింద నీటి విడుదలను ఆపించేసి మూడు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. నిధుల మంజూరు, టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయ్యాక ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టి తొమ్మిది నెలలు గడిచింది. ఇంత వరకు కాల్వల వెంట చెట్లను మాత్రమే తొలగించారు. కాల్వ కట్టల్ని సరి చేసే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు పంటలకు నీళ్లివ్వకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ యాసంగి సీజన్‌లో అప్రకటిత క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల వరి, జొన్న సాగు చేసిన రైతులు పండలెండి తీవ్రంగా నష్టపోయారు. అయినా మరమ్మతుల పనులు వేగంగా సాగట్లేదు. కాల్వలకు ఇరువైపులా సీసీ లైనింగ్ వేయడం, అడుగు భాగాన సీసీ బెడ్ పోసే పనులు చేయాల్సి ఉంది. వేసవిలోనే సీసీ వర్క్ పనుల్ని పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. జూన్ ప్రారంభంలోనే వర్షాలు పడే అవకాశముంది. తొమ్మిది నెలలు నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్ ఈ కొద్ది సమయంలో 82 కిలో మీటర్ల మేర కాల్వలకు సీసీ లైనింగ్ ఎలా చేయగలరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేదంటున్నారు.
పనుల్లో నాణ్యత డొల్ల
కాల్వల మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించట్లేదనే ఆరోపణలున్నాయి. జంగిల్ కటింగ్ చేసిన కాంట్రాక్టుర్ కాల్వ కట్టల్ని వెడల్పు చేయడం, సపోర్ట్ వాల్స్ వేయడం, అడుగు భాగంలో పూడిక తీయడం వంటి పనులు చేశారు. కాల్వ కట్టలను పటిష్టం చేసేందుకు కొత్త మట్టి తెచ్చి పోయాలి. అట్టి మట్టిని రోడ్ రోలర్స్‌తో తొక్కించి గట్టిపడేలా చూడాలి. కానీ.. కాల్వలో అడుగున ఉన్న పూడిక మట్టినే కాల్వ కట్టలపై పోసి జేసీబీలతో మమా అనిపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీటిలో కాల్వకు పోసిన మట్టి కొట్టుకుపోయి కొయ్యలు పడ్డాయి. కాల్వల ఇరువైపులా కొయ్యలు పడటం వల్ల మళ్లీ సరి చేయడం కోసం అంచనాలు పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సీసీ లైనింగ్ పనుల్లోనూ ఐరన్, సిమెంట్, కంకర మిక్సింగ్ విషయంలోనూ నాణ్యత పాటించకపోతే కాల్వల లైనింగ్ ఒకటి రెండు సీజన్లలోనే పాడైపోయే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. సీసీ బెడ్, లైనింగ్ పనులు తొందరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈ నాగరాజు తెలిపారు.
ఖరీఫ్ వరకు పూర్తి చేయాలి : విద్యాసాగర్, సీపీఐ(ఎం) జోగిపేట ఏరియా కార్యదర్శి
ఇప్పటికే మూడు పంటలకు నీళ్లివ్వలేదు. కాల్వల మరమ్మతుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేదు. మంత్రి జోక్యం చేసుకుని ఖరీఫ్ సీజన్ వరకు నీటిని ఇచ్చే విధంగా పనులు పూర్తి చేయాలి. ఇప్పటికే మూడు పంటల్లేక రైతులు నష్టపోయారు. పనుల్లోనూ నాణ్యత ఉండట్లేదు.
నత్తనడకన.. సింగూర్ కాల్వల పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES