- 250 టార్గెట్‌ను ఊదేసిన విండీస్
- రాంచి టీ20లో టీమ్ ఇండియాకు షాక్
- భారత్ 249/5, వెస్టిండీస్ 252/4
స్లో పిచ్‌పై పరుగుల వరద పారింది. ఇప్పటివరకు ఒక్కసారే 200 ప్లస్ నమోదైన గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 500 పరుగులు పోటెత్తాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పరుగుల పండుగలో ఆతిథ్య భారత్‌కు వెస్టిండీస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. వరుసగా 11వ విజయంపై కన్నేసిన టీమ్ ఇండియా తొలుత 249 పరుగులు చేసినా.. విజయానికి దూరమైంది. కెప్టెన్ షయ్ హోప్ (102 నాటౌట్) మరోసారి అసమాన ఇన్నింగ్స్‌తో కరీబియన్లను గెలుపు తీరాలకు చేర్చాడు. రాంచి టీ20లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. భారత్, విండీస్ మూడో టీ20 ఇండోర్‌లో ఆదివారం జరుగుతుంది.
నవతెలంగాణ-రాంచి
పట్టువదలని విక్రమార్కుడు షయ్ హోప్ (102 నాటౌట్, 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) రాంచిలో రెచ్చిపోయాడు. రికార్డు 250 పరుగుల లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచి జట్టును ముందుండి నడిపించాడు. మయాంక్ యాదవ్ (3/36) మూడు వికెట్ల ప్రదర్శనతో ఓ దశలో వెస్టిండీస్ విజయంపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (84, 37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) జతగా దంచికొట్టిన షయ్ హోప్.. కరీబియన్లకు ఖతర్నాక్ విజయాన్ని అందించాడు. 18.3 ఓవర్లలోనే 252 పరుగులు చేసిన వెస్టిండీస్ మరో 9 బంతులు ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (82, 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. ఇషాన్ కిషన్ (43, 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (44 నాటౌట్, 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (40, 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో అజేయ సెంచరీతో కదంతొక్కిన వెస్టిండీస్ కెప్టెన్ షయ్ హోప్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
హోప్ ఛేదించెన్
వెస్టిండీస్ లక్ష్యం 250 పరుగులు. భారత బౌలర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో కరీబియన్ల విజయంపై ఎవరికీ అంచనాలు లేవు. ఓపెనర్ కామిల్ పూరన్ (4), షిమ్రోన్ హెట్‌మయర్ (0), రోవ్‌మాన్ పావెల్ (24)లను యువ పేసర్ మయాంక్ యాదవ్ డగౌట్‌కు సాగనంపాడు. దీంతో 58/3తో వెస్టిండీస్ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో నిలబడిన షయ్ హోప్ (102 నాటౌట్)కు జతకలిసిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (84) విండీస్ శిబిరంలో విజయం ఆశలు రేపాడు. ఈ జోడీ నాల్గో వికెట్‌కు 54 బంతుల్లోనే 120 పరుగులు జోడించింది. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో రూథర్‌ఫోర్డ్ ఊచకోత కోయగా.. షయ్ హోప్ సైతం 9 సిక్సర్లతో చెలరేగాడు. రూథర్‌ఫోర్డ్ అవుటైనా.. షెఫర్డ్ (34 నాటౌట్) తోడుగా హోప్ లాంఛనం ముగించాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించిన హోప్.. మరో 9 బంతులు ఉండగానే విండీస్‌ను గెలుపు గీత దాటించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, నమన్ ధిర్, శివం దూబె ధారాళంగా పరుగులు ఇచ్చారు. పవర్‌ప్లే అనంతరం వికెట్ల వేటలో వెనుకంజ వేసిన టీమ్ ఇండియా భారీ మూల్యం చెల్లించింది.
సమిష్టిగా మెరిసినా..
టాస్ ఓడిన భారత్ రాంచిలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఇక్కడ భారీ స్కోర్ల రికార్డు లేకపోవటంతో అభిమానులు సైతం స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌కే సిద్ధమయ్యారు. కానీ ఓపెనర్లు ధనాధన్ ఆరంభంతో భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. అభిషేక్ శర్మ (20) అవుటైనా.. సంజు శాంసన్ (82) దంచికొట్టాడు. నాలుగు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లతో మెరిశాడు. సొంతగడ్డపై ఇషాన్ కిషన్ (43) కదం తొక్కినా అర్థ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోయాడు. శివం దూబె (7) నిరాశపరిచినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (44 నాటౌట్) 33 బంతుల్లోనే 83 పరుగులు పిండుకున్నారు. ఆఖరు ఓవర్లలో వేగంగా పరుగులు సాధించిన ఈ జోడీ భారత్‌కు భారీ స్కోరు అందించింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ (3/24) ఇరు జట్ల మధ్య వ్యత్యాసంగా నిలిచే గణాంకాలు నమోదు చేశాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ (సి) మోటీ (బి) ఛేజ్ 20, సంజు శాంసన్ (సి) పూరన్ (బి) స్పింజర్ 82, ఇషాన్ కిషన్ (బి) ఛేజ్ 43, శివం దూబె (బి) ఛేజ్ 7, శ్రేయస్ అయ్యర్ (సి) హెట్‌మయర్ (బి) స్పింజర్ 40, తిలక్ వర్మ నాటౌట్ 44, నమన్ ధిర్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 249.
వికెట్ల పతనం : 1-42, 2-139, 3-158, 4-162, 5-245.
బౌలింగ్ : అకీల్ హోస్సేన్ 3-0-46-0, రోమారియా షెఫర్డ్ 3.4-0-47-0, రోస్టన్ ఛేజ్ 4-0-24-3, మోటీ 2-0-21-0, షమర్ జోసెఫ్ 3-0-39-0, షమర్ స్పింజర్ 4-0-64-2, రోవ్‌మాన్ పావెల్ 0.2-0-7-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : షయ్ హోప్ నాటౌట్ 102, కామిల్ పూరన్ (సి) బిష్ణోయ్ (బి) మయాంక్ 4, షిమ్రోన్ హెట్‌మయర్ (బి) మయాంక్ 0, రోవ్‌మాన్ పావెల్ (బి) మయాంక్ 24, రూథర్‌ఫోర్డ్ (సి) శాంసన్ (బి) కుల్‌దీప్ 84, షెఫర్డ్ నాటౌట్ 34, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 252.
వికెట్ల పతనం : 1-5, 2-5, 3-58, 4-178.
బౌలింగ్ : మయాంక్ యాదవ్ 3-0-36-3, అర్ష్‌దీప్ సింగ్ 4-0-45-0, అక్షర్ పటేల్ 3.3-0-63-0, శివం దూబె 2-0-30-0, కుల్‌దీప్ యాదవ్ 4-0-53-1, నమన్ ధిర్ 2-0-25-0.






కామెంట్‌లు (0)