334 ఛేదనలో 89 ఆలౌట్
244 పరుగులతో కివీస్ భారీ విజయం
మాట్ హెన్రీకి 6 వికెట్లు, యంగ్ సెంచరీ
కొందరు కివీస్ తొలి ప్రాధాన్య ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. మరికొందరు టెస్టు సన్నాహాక శిబిరంలో చేరారు. వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ను నిలువరించటం న్యూజిలాండ్‌కు కష్టమే అనిపించింది. కానీ మౌంట్ మాంగనుయ్‌లో అంచనాలు తలకిందులయ్యాయి. విల్ యంగ్ (125) సెంచరీతో న్యూజిలాండ్ 333 పరుగులు చేయగా.. మాట్ హెన్రీ (6/27) ఆరు వికెట్ల విజృంభణతో ఛేదనలో భారత్ 89 పరుగులకే కుప్పకూలింది. బ్యాట్, బంతితో భారత్‌పై పంజా విసిరిన న్యూజిలాండ్ 244 పరుగుల తేడాతో నాల్గో వన్డేలో భారీ విజయం సాధించింది.
మౌంట్ మాంగనుయ్
మౌంట్ మాంగనుయ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ అదరగొట్టింది. కీలక ఆటగాళ్లు లేని వేళ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టీమ్ ఇండియాపై పంజా విసిరింది. 334 పరుగుల ఛేదనలో భారత్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో 244 పరుగుల తేడాతో కివీస్ భారీ విజయం సాధించింది. పేసర్ మాట్ హెన్రీ (6/27) స్వింగ్ మాయతో భారత బ్యాటర్లను వణికించాడు. టాప్-4 బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (5) ఒక్కడే పరుగుల ఖాతా తెరిచాడు. రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లి (0), శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్‌గా నిష్ర్కమించారు. భారత జట్టులో ఇషాన్ కిషన్ (27, 53 బంతుల్లో 4 ఫోర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు, విల్ యంగ్ (125, 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. టిమ్ సీఫర్ట్(58, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిన్ అలెన్ (41, 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆరు వికెట్లతో చెలరేగిన మాట్ హెన్రీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-2తో రేసులోకి వచ్చింది. భారత్, న్యూజిలాండ్ ఆఖరు వన్డే ఆదివారం మౌంట్ మాంగనుయ్‌లోనే జరుగనుంది.
బ్యాట్లేత్తేశారు
భారత బ్యాటర్లు ఫామ్‌లో ఉండగా, 334 పరుగుల లక్ష్యం చిన్నదే అనిపించింది. కానీ, తొలి ఓవర్లోనే మాట్ హెన్రీ భారత్‌కు ఓటమి ఛాయలు చూపించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మ (0) స్లిప్స్‌లో క్యాచౌట్ అయ్యాడు. ఐదో బంతికి విరాట్ కోహ్లి (0) వికెట్ పడిపోగా.. ఆరో బంతికి శ్రేయస్ అయ్యర్ (0) ఎల్బీగా నిష్క్రమించాడు. బంతి ఆలస్యంగా స్వింగ్ అవటంతో రోహిత్, కోహ్లి, శ్రేయస్‌లు అంచనా వేయలేకపోయారు. ఫలితంగా సున్నా పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5)ను జెమీసన్ అవుట్ చేయగా.. 9 పరుగులకే భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ (27), అక్షర్ పటేల్ (21) కాసేపు వికెట్ల పతనం నిలువరించారు. మాథ్యూ ఫిషర్ ఈ జోడీని విడదీసి మళ్లీ వికెట్ల పతనం షురూ చేశాడు. నమన్ ధీర్ (21) తర్వాత ఎవరూ ప్రతిఘటించలేదు. అకిబ్ నబి (5), కుల్‌దీప్ (1), గుర్నూర్ (2)లు వికెట్లు సమర్పించుకున్నారు. 26.4 ఓవర్లలోనే భారత్ 89 పరుగులకు కుప్పకూలింది. మాథ్యూ ఫిషర్ 3 వికెట్లు పడగొట్టగా, మాట్ హెన్రీ ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
విల్ యంగ్ సెంచరీ
టాస్ నెగ్గిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విల్ యంగ్ (125), టిమ్ సీఫర్ట్ (58) తొలి వికెట్‌కు 85 పరుగులతో శుభారంభం అందించారు. ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లేలో కివీస్ 72 పరుగులు చేసింది. సీఫర్ట్ 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. విల్ యంగ్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేశాడు. సీఫర్ట్‌ను గుర్నూర్ అవుట్ చేయగా భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. నిక్ కెల్లీ (4), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (8) వికెట్లతో కివీస్‌పై బౌలర్లు ఒత్తిడి పెంచారు. విల్ యంగ్‌తో జతకలిసిన ఫిన్ అలెన్ (41, 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) 66 బంతుల్లోనే 90 పరుగులు జోడించాడు. బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న యంగ్ 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 88 బంతుల్లో సెంచరీ సాధించాడు. యంగ్ అవుటైనా.. కివీస్ లోయర్ ఆర్డర్ పరుగుల వేట కొనసాగించింది. మిచెల్ శాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (22), కైల్ జెమీసన్ (19 నాటౌట్) కివీస్‌కు 333 పరుగుల భారీ స్కోరు అందించారు. భారత బౌలర్లలో అకిబ్ నబి, గుర్నూర్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : విల్ యంగ్ (సి) కుశాగ్ర (బి) నమన్ ధీర్ 125, టిమ్ సీఫర్ట్ (సి) కిషన్ (బి) గుర్నూర్ 58, నిక్ కెల్లీ (స్టంప్డ్) కిషన్ (బి) అక్షర్ 4, ఫాక్స్‌క్రాఫ్ట్ (సి) గుర్నూర్ (బి) అకిబ్ 8, అలెన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 41, బ్రాస్‌వెల్ (సి) నమన్ ధీర్ (బి) గుర్నూర్ 15, మిచెల్ శాంట్నర్ (సి) కిషన్ (బి) అర్ష్‌దీప్ 24, క్లార్క్ (ఎల్బీ) అకిబ్ 22, కైల్ జెమీసన్ నాటౌట్ 19, మాట్ హెన్రీ (రనౌట్) 2, మాథ్యూ ఫిషర్ (రనౌట్) 1, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (50 ఓవర్లలో ఆలౌట్) 333.
బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్ 10-0-55-1, అకిబ్ నబి 8-0-59-2, గుర్నూర్ బరార్ 10-0-69-2, అక్షర్ పటేల్ 10-0-39-2, కుల్‌దీప్ యాదవ్ 8-0-73-0, నమన్ ధీర్ 4-0-29-1.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) అలెన్ (బి) హెన్రీ 0, రుతురాజ్ గైక్వాడ్ (సి) బ్రాస్‌వెల్ (బి) జెమీసన్ 5, విరాట్ కోహ్లి (బి) హెన్రీ 0, శ్రేయస్ అయ్యర్ (ఎల్బీ) హెన్రీ 0, ఇషాన్ కిషన్ (బి) హెన్రీ 27, అక్షర్ పటేల్ (సి) అలెన్ (బి) ఫిషర్ 21, నమన్ ధీర్ (సి) శాంట్నర్ (బి) ఫిషర్ 21, అకిబ్ నబి (సి) సీఫర్ట్ (బి) ఫిషర్ 5, కుల్దీప్ యాదవ్ (బి) హెన్రీ 1, గుర్నూర్ (బి) హెన్రీ 2, అర్ష్‌దీప్ సింగ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (26.4 ఓవర్లలో ఆలౌట్) 89.
బౌలింగ్ : మాట్ హెన్రీ 9.4-2-27-6, కైల్ జెమీసన్ 6-2-1201, క్రిస్టియన్ క్లార్క్ 2-0-13-0, మాథ్యూ షిఫర్ 7-1-31-3, మైకల్ బ్రాస్‌వెల్ 2-0-6-0.





కామెంట్‌లు (0)