“ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించినందుకే నా వీసా రద్దు చేశారా? ఆయన ప్రభుత్వ పాలనను విమర్శించినందుకా? అదానీ, అంబానీలపై నేను రాసిన విమర్శనాత్మక కథనాలు కూడా కారణమా?” అంటూ నార్వే జర్నలిస్టు హెల్లె లింగ్ స్వెండ్సన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. “నాకు రాజకీయ అనుమతి ఉంది. వీసా కూడా మంజూరైంది. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ నాకోసం ఎదురుచూస్తోంది. అయినా దేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు అనుమతించడం లేదు? ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా అనిపిస్తోంది” అని ఆమె నిలదీశారు. మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పరస్పరం ముడిపడి ఉన్న అంశాలపై మాట్లాడేందుకు ఆహ్వానించిన జర్నలిస్టుకే ఇలాంటి అనుభవం ఎదురుకావడం మీడియా స్వేచ్ఛ ఎదుర్కొంటున్న సవాళ్లను మరో సారి ముందుకు తెచ్చింది. విమానా శ్రయానికి బయలుదేరడానికి పది నిమిషాల ముందు భారత రాయబార కార్యాలయం హెల్లెకు ఫోన్ చేసి, వీసా చెల్లదని, ప్రయాణించవద్దని తెలిపింది.
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. చివరి నిమిషంలో వీసా రద్దు అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. కేంద్రానికి అభ్యంతరం ఆమె పర్యటనపైనా, లేక అడిగిన ప్రశ్నలపైనా?
ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలి. మేలో నార్వే పర్యటన సందర్భంగా మోడీ, ఆ దేశ ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నార్వే జర్నలిస్టులు తమ ప్రధానిని ప్రశ్నిస్తుంటే, భారత ప్రధాని విలేకరుల ప్రశ్నలను ఎందుకు స్వీకరించరని హెల్లె అడిగారు. మోడీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్ మాలవీయ ఆమెను విమర్శించారు. అదే జర్నలిస్టు వీసా రద్దు కావడం అనుమానాలకు తావిస్తోంది. భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి సుమారు వెయ్యిమందిని ఆహ్వానించగా, 315 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నారు. వంద మందికి పైగా వీసా నిరాకరణ, జాప్యాన్ని ఎదుర్కొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో నలుగురు విదేశీ ప్రతిని ధులనూ వెనక్కి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రతిని ధుల సామాజిక మాధ్యమ ఖాతా లను పరిశీలించడం, ఆహ్వానించి అనుమతులిచ్చిన తర్వాత అడ్డుకో వడం అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దిగజారుస్తోంది.
‘ది వైర్’ కథనం మరోకోణాన్ని బయట పెట్టింది. విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి ఇచ్చిన 315 మంది ప్రతినిధుల్లో సుమారు 113 మందికి భారత్‌లో ప్రవేశం నిరాకరించారు. కొందరికి మంజూరైన వీసాలను కూడా హోంశాఖ వెనక్కి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ సదస్సుల మార్గదర్శ కాల ప్రకారం కొన్ని దేశాల పౌరులు, నిషేధిత ప్రాంతాలకు వెళ్లేవారి విషయంలోనే హోంశాఖ ప్రత్యేక పరిశీలన అవసరమని వారు ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులు లేని ప్రతినిధులను ఎందుకు అడ్డుకున్నారు? విదేశాంగ శాఖ అనుమతి తరువాత హోంశాఖ జోక్యానికి ప్రాతిపదిక ఏమిటి?
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది.
మోడీని ప్రశ్నించడం తప్ప హెల్లె చేసిన నేరమేమిటని నిలదీసింది. వీసా రద్దుకు కారణాలు వెల్లడించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆమెను భారత్‌కు అనుమతించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి చర్యలు భారత్ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. పాలకులను ప్రశ్నించడం జర్నలిస్టుల విధి. ఆ ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉన్నాయని వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నవంబర్ 12న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో దీపావళి మిలన్ సందర్భంగా మోడీ మీడియాను, విలేకరుల అంకితభావాన్ని ప్రశంసించారు. కానీ, ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉందనడానికి నార్వే జర్నలిస్టు ఉదంతమే ఉదాహరణ. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పన్నెండేండ్లయినా, ఒక్క ప్రెస్‌మీట్ నిర్వహించలేదన్నది బహిరంగ రహస్యం.
మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ప్రధాని ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ఎందుకు వెను కాడుతున్నారు? ప్రభుత్వాన్ని విమర్శించే వారిని దేశవ్యతిరేకులుగా చిత్రించడం, నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని ఆరోపించడం, విదేశీ జర్నలిస్టుల ప్రవేశాన్ని అడ్డుకోవడం ఒకే ధోరణిలోని రూపాలుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సదస్సును భారత వ్యతిరేక వేదికగా బీజేపీ నేతలు అభివర్ణించడం కూడా ఇందుకు ఉదాహరణ.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి నచ్చిన ప్రశ్నలకే అనుమతి ఉండదు, నచ్చని ప్రశ్నలకూ సమాధానం చెప్పాలి. మీడియా స్వేచ్ఛను ప్రసంగాల్లో ప్రశంసించడం సులభం. తనను ప్రశ్నించే జర్నలిస్టుల స్వేచ్ఛను గౌరవించినప్పుడే ఆ మాటలకు విలువ. ప్రపంచ వేదికలపై భారత్ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటుకోవాలంటే, దేశంలోనూ భిన్నాభిప్రాయాలకు, ప్రశ్నించే గొంతులకు రక్షణ కల్పించాలి. విమర్శను స్వీకరించలేని పాలకులు ప్రజాస్వామ్య విలువలను కాపాడలేరు.






కామెంట్‌లు (0)