Magazines

మీ ప్రేమ నిజమైతే..?

14 నిమిషాల క్రితం

love
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 4 నిమిషాల చదవడం

కొందరి వాదనలు వినడానికి విచిత్రంగా ఉంటాయి. అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టడతున్నారని తెలిసినా ముందు ఏమీ అనరు. తీరా ఇద్దరూ పెండ్లి చేసుకోవాలి అనుకునే సరికి ఎక్కడ లేని సమస్యలు వచ్చి పడతాయి. కొందరు పెద్దలైతే ఏవో కారణాలు చెప్పి ప్రేమించుకున్న ఇద్దరిని విడగొట్టాలని చూస్తుంటారు. వారు చెప్పే కారణాలు కూడా చాలా వింతగా ఉంటాయి. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో చదువుదాం...


సోనియాకు దాదాపుగా 28 ఏండ్లు ఉంటాయి. ఆమె టీచర్‌‌గా ఉద్యోగం చేస్తుంది. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెలు ఉన్నారు. వీరిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరు అక్కలకు పెండ్లి జరిగింది. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే బంధువుల్లోని రంగనాధ్‌‌ అనే అబ్బాయితో ఆమెకు పరిచయమయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా మూడేండ్లు గడిచిపోయాయి. పెండ్లి కాకుండానే సోనియా నెల తప్పింది. ఇప్పుడు ఆమెకు మూడో నెల. ఇద్దరూ ఇష్టపడుతున్నారనే విషయం వాళ్ల బంధులందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ మాట్లాడరు. బంధువులే కాదు చివరకు కుటుంబ సభ్యులు కూడా మౌనంగానే ఉన్నారు. ఎవరూ ఏమీ అనకపోవడంతో ఎలాగో పెండ్లి చేసుకోబోతున్నాము కదా అని తొందరపడ్డారు. ​

అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే సోనియా నెలతప్పిందని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్లు వీరి పెండ్లికి ఒప్పుకోవడం లేదు. ‘నువ్వు రంగనాధ్‌తో ఎలాంటి సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు, అతనికి ఉద్యోగం లేదు. పెద్దగా చదువుకోలేదు’ అని ఆమెను కట్టడి చేశారు. ‘లేదు అతనే కావాలంటే ఇంట్లో నుండి వెళ్లిపో’ అంటున్నారు. అటు రంగనాధ్‌ కుటుంబం కూడా వీరి ప్రేమను అంగీకరించడం లేదు. ‘నువ్వు ఆమెను పెండ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. అసలు ఆమెతో మాట్లాడడం కూడా మాకు నచ్చడం లేదు’ అంటూ ఆంక్షలు విధించారు. దాంతో రంగనాధ్‌ ఆమెతో మాట్లాడడం మానేశాడు. అతనితో మాట్లాడాలని, పెండ్లి చేసుకోవాలని సోనియా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా రంగనాధ్‌ ఆమెతో మాట్లాడడం లేదు. దాంతో సోనియా ఒంటరి అయిపోయింది. ఇటు కుటుంబం, అటు ప్రేమించిన వ్యక్తి ఇద్దరూ కాదు అనడంతో ఎటు వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఐద్వా లీగల్‌‌సెల్‌‌కు వచ్చింది. ​

ఆమె చెప్పింది మొత్తం విని ధైర్యం చెప్పి రంగనాధ్‌‌ని, అతని తల్లిదండ్రులను ఆఫీస్‌‌కి పిలిచి మాట్లాడితే ‘సోనియా వాళ్ల కుటుంబం అంటే మాకు ఇష్టం లేదు. వారి కుటుంబంలో అందరికీ అహంకారం ఎక్కువ. ఇతరులను తక్కువ చేసి చూస్తారు. ఎవరినీ లెక్కచేయరు. అలాంటి ఇంటి నుండి అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకుంటే మా కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. అందుకే మేము ఆమెను మా ఇంటి కోడలిని చేసుకోవడానికి ఇష్టపడడం లేదు’ అన్నారు. ​రంగనాధ్‌‌తో మాట్లాడితే ‘మా అమ్మానాన్నలకు సోనియా అంటే ఇష్టం లేదు. అందుకే నేను ఆమెతో మాట్లాడడం లేదు. మా తల్లిదండ్రులకు ఇష్టం లేని వ్యక్తిని నేను ఇంటికి ఎలా తీసుకొస్తాను. వాళ్లని కాదని మేము పెండ్లి చేసుకుంటే ఇంట్లో రోజూ గొడవలే జరుగుతాయి. పెండ్లి చేసుకొని బాధపడడం కంటే అసలు చేసుకోకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా! అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అన్నాడు. దానికి సోనియా ‘అయితే మీ ఇంట్లో వాళ్లకు నేనంటే ఇష్టం లేదని మనం ప్రేమించుకునేటప్పుడు తెలియదా?

ఇంత దూరం వచ్చిన తర్వాత, నేను తల్లిని కాబోతుంటే ఇప్పుడు నీకు ఇవన్నీ గుర్తుకు వచ్చాయా’ అంది. ​వెంటనే మేము ‘ఏంటీ తమాషా చేస్తున్నావా? ఆమె కుటుంబం మంచిది కాదని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ముందు ఈ విషయాలేమీ నీకు తెలియదా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? మీ అందరిపైనా కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాము’ అని గట్టిగా మాట్లాడేసరికి రంగనాధ్‌ ‌తల్లి కల్పించుకొని ‘వాళ్లిద్దరికీ పెండ్లి చేయడం మాకు ఇష్టమే. కానీ ఇద్దరికీ వరస కలవదని మేము వద్దంటున్నాము. తెలంగాణలో మామ వరస అయిన వారిని పెండ్లి చేసుకోరు కదా మేడం, అందుకే వద్దు అంటున్నాము’ అంది. ​మీ కొడుకు సోనియాకు మామ వరస అవుతాడనే విషయం మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? మూడేండ్ల నుండి కలిసి తిరుగుతుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎందుకు ఉన్నారు మరీ? ఈ విషయం ముందే చెప్పి వాళ్లను ఆపితే సరిపోయేది కదా? అప్పుడేమో సైలెంట్‌‌గా ఉన్నారు.

ఇప్పుడేమో అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆమెకు ఇప్పుడు మూడో నెల. ఇలాంటి పరిస్థితుల్లో పెండ్లి చేసుకోము, వరస కాదు అంటూ ఏవేవో చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోము. ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని ప్రేమించుకొన్నారు. తొందరపడి తల్లిదండ్రులు కూడా అవ్వబోతున్నారు. పెండ్లి చేసుకోవల్సిందే అని చెప్పాము. ​రంగనాధ్‌‌ను పక్కకు పిలిచి నీకసలు సోనియా అంటే నిజంగా ఇష్టం ఉందో లేదో సూటిగా చెప్పు అని అడిగాము. దానికి అతను ‘సోనియా అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఆమెకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఎలాగైనా పెండ్లి చేసుకుంటాము కదా అనే తొందరపడ్డాము.’ అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే మీ ఇద్దరు పెండ్లి చేసుకొని వేరేగా ఉండండి. పైగా మీ ఇంట్లో పెండ్లి కావల్సిన అక్క కూడా ఉంది. మీరు వేరుగా ఉంటేనే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దవాళ్లతో కలిసి ఉంటే నువ్వన్నట్టు గొడవలు జరుగుతాయి.

అలా అని సోనియాను మోసం చేయడం కూడా కరెక్టు కాదు. నువ్వు ఎంతో ప్రేమించిన అమ్మాయి, నీ బిడ్డకు తల్లి కాబోతుంది. ఇలాంటి సమయంలో ఆమెను బాధపెట్టడం సరైనది కాదు. బాగా ఆలోచించుకో. మీకు అండగా మేముంటాము. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇద్దరూ పెండ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. కొన్ని రోజులు పోతే అంతా సర్దుకుంటుంది’ అని భరోసా ఇచ్చాము. సోనియా కుటుంబంతో కూడా మాట్లాడి ఒప్పించాము. బాగా ఆలోచించిన రంగనాధ్‌ ‌సోనియాతో పెండ్లికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ పెండ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్