భారత్, న్యూజిలాండ్ ఆఖరు టీ20 నేడు
విజయంతో ముగించేందుకు ఇరు జట్ల ఆరాటం
మధ్యాహ్నం 12.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
నవతెలంగాణ-హామిల్టన్ : ధనాధన్ జోరుతో ఉర్రూతలూగించిన భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు నేడు హామిల్టన్‌లో తెరపడనుంది. ఐదు మ్యాచ్‌లో సిరీస్‌ను హ్యాట్రిక్ విజయాలతో భారత్ కైవసం చేసుకున్నా, గత మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పుంజుకుంది. మరో విజయంతో సిరీస్‌ను మెరుగ్గా ముగించాలని న్యూజిలాండ్ ఎదురుచూస్తుండగా, 4-1తో సిరీస్‌ను సాధించాలనే పట్టుదల టీమ్ ఇండియా శిబిరంలో కనిపిస్తోంది. హామిల్టన్లోనూ చిన్న బౌండరీలు ఎదురు కానుండగా.. మరోసారి భారీ స్కోర్లు నమోదు కావటం లాంఛనమే. భారత్, న్యూజిలాండ్ ఐదో టీ20 నేడు.
ఆ ఇద్దరిపైనే ఫోకస్
టీ20ల్లో టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్ ఎదుర్కొంటుంది. వరుస సిరీస్‌ల్లో ఆడాల్సి వచ్చినా, గెలుపు బాటలోనే నడుస్తోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు టాప్ ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కుతుండగా.. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. లక్నో టీ20లో సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత ఒక్క అర్థ సెంచరీ కూడా చేయలేదు. బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ సైతం ఇదే బలహీనత ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో దూకుడుగా ఆడినా, భారీ స్కోర్లు చేయలేదు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సంజూ శాంసన్ అంచనాలను అందుకోలేదు. నేడు ఆఖరు మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ మెరిస్తే భారత బ్యాటింగ్ లైనప్‌లో అందరూ గాడిలో పడినట్టు అవుతుంది. తిలక్ వర్మ సైతం ఓ భారీ ఇన్నింగ్స్‌తో సిరీస్‌ను మెరుగ్గా ముగించాలని చూస్తున్నాడు. బౌలింగ్ లైనప్‌లో కొన్ని మార్పులు కనిపించే వీలుంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఓ అవకాశం కోసం చూస్తున్నారు.
విజయంతో ముగించాలని..
ఈడెన్‌పార్క్‌లో భారీ స్కోరు బాదిన కివీస్, భారీ విజయం ఖాతాలో వేసుకుంది. సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న గ్లెన్ ఫిలిప్స్ ఆక్లాండ్‌లో సెంచరీ సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్‌తో పాటు ఫిన్ అలెన్ సైతం మెరిస్తే హామిల్టన్‌లో ఆతిథ్య జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ విభాగం సైతం గత మ్యాచ్‌లో రాణించింది. జాకబ్ డఫ్ఫీ, మిచెల్ శాంట్నర్‌లు పేస్, స్పిన్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. పవర్‌ప్లేలో జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ మరోసారి కీలకం కానుంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లను నిలువరించటంపైనే న్యూజిలాండ్ అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.






కామెంట్లు (0)