భువనేశ్వర్ : ఒడిశాలో దారుణం చోటు చేసుకున్నది. ఓ కీచక లెక్చరర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక విద్యార్థి కాలేజీలోనే నిప్పంటించుకున్నది. ప్రస్తుతం ఆ విద్యార్థిని 95 శాతం గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం సస్పెండ్ చేసింది. బాలాసోర్‌లోని ఓ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఫకీర్ మోహన్ కాలేజీలో ఓ విద్యార్థిని ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. ఓ విభాగానికి చెందిన హెచ్‌ఓడీ సదరు విద్యార్థినిని కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తనమాట వినకుంటే భవిష్యత్ నాశనం చేస్తానని బెదిరించాడు. విద్యార్థిని నిరాకరించినా అవేమీ పట్టించుకోకుండా తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇవి భరించలేని ఆ విద్యార్థిని గతనెల 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వారంలో చర్యలు తీసుకుంటామని మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. గడువు ముగిసినా ఆ లెక్చరర్‌పై యాజమాన్యం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తనను వేధింపులకు గురిచేస్తున్న లెక్చరర్‌ను రక్షించే ప్రయత్నం జరుగుతోందని బాధిత విద్యార్థి ఆవేదన చెందింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం పాటు కాలేజీ క్యాంపస్‌లో నిరసన కూడా చేపట్టింది. శనివారం ఉదయం కూడా తోటి విద్యార్థులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగింది. అదే సమయంలో ప్రిన్సిపల్ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగెత్తిన ఆమె.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. తోటి విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలితో పాటు మరో విద్యార్థి సైతం 70 శాతం గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్నది. లైంగిక వేధింపులకు సంబంధించి విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై అంతర్గత కమిటీ దర్యాప్తు చేపడుతోందని కాలేజీ ప్రిన్సిపల్ వెల్లడించారు. శనివారం ఉదయం కూడా ఇదే విషయంపై బాధిత విద్యార్థిని తనను కలిసి మాట్లాడిందన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హెచ్‌ఓడీని అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES