నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలు ఏకే శ్రీలేఖ (68), ఆమె భర్త ప్రేమరాజన్ (75)ల కాలిన మృతదేహాలు లభ్యమయ్యాయి. కన్నూర్ జిల్లాలోని అలవిల్ ప్రాంతంలోని వారి ఇంట్లో పోలీసులు వాటిని గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమరాజన్ దంపతులు కన్నూర్‌లో ఒంటరిగా నివసిస్తుండగా, వారి ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. గురువారం సాయంత్రం కారు డ్రైవర్ వారి ఇంటికి రావడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. విదేశాల నుంచి వస్తోన్న ప్రేమరాజన్ కుమారుడిని ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకువచ్చేందుకు కారు కోసం డ్రైవర్ ఇంటికి వచ్చాడు. వారిని ఎన్నిసార్లు పిలిచినా బయటకురాకపోవడంతో బంధువులు, పొరుగు వారికి ఆ విషయాన్ని తెలియజేశాడు. వారి సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా.. కాలిన మృతదేహాలు కనిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి గమనించగా.. రక్తపు మరకలతో ఉన్న సుత్తి కనిపించింది. అలాగే శ్రీలేఖ తలపై ఎవరో కొట్టిన గాయం ఉందని ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. వారిని కాల్చడానికి ముందు ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
బుధవారం తర్వాత ఆ దంపతులను తాము చూడలేదని ఇరుగుపొరుగు వారు వెల్లడించారు. అయితే ఇంట్లోకి ఎవరూ చొచ్చుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి అసహజ మరణాలుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత మరణాలకు గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.