నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కలకత్తా విద్యార్థినిపై అదే విద్యాసంస్థకు చెందిన ఓ విద్యార్థి లైంగికదాడి చేశాడు. బాయ్స్ హాస్టల్ లో లైంగికదాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయగా, దాని ఆధారంగా నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే, మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తానని ఆ యువకుడు సదరు బాధితురాలిని తమ హాస్టల్‌కు ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు మత్తు కలిపిన పానీయం ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది.
స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై లైంగికదాడి జరిగిందని బాధితురాలు గుర్తించింది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించినట్లు కూడా ఆమె ఆరోపించారు. నిందితుడైన విద్యార్థిని శుక్రవారం రాత్రే అదుపులోకి తీసుకుని, శనివారం లాంఛనంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.