నవతెలంగాణ-హైదరాబాద్: భార్య బురఖా ధరించకుండా బయటకు వెళ్లిందని ఆమెను భర్త గన్ తో కాల్చిచంపాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు ఫారుక్. అతడు ఓ హోటల్‌లో రోటి మాస్టర్. తండ్రి, సోదరుల నుంచి వేరుగా నివసిస్తున్న ఫారుక్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. భార్య తాహిరా, కుమార్తెలు ఆఫ్రీన్ (16), సహరీన్ (14) బుర్కా ధరించి బయటకు వెళ్లాలని ఫారుక్ ఒత్తిడి తెచ్చేవాడని, దీనికి తాహిరా అంగీకరించకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఫారుక్ అవమానంగా భావించాడని విచారణలో వెల్లడైంది.
విచారణలో ఫారుక్ తెలిపిన వివరాల ప్రకారం.. భార్య, కుమార్తెలు బుర్కా లేకుండా బయటకు వెళ్లడంపై అతడికి తీవ్ర కోపం వచ్చేదని, అదే కోపంతో క్యారానా నుంచి అక్రమంగా తుపాకీ, అందులోకి బుల్లెట్స్ కొనుగోలు చేశాడని తెలిపాడు. భార్య తాహిరాను లేపి కాల్చి చంపాడు. ఆ ఘటనలో తుపాకీ శబ్దంతో మేల్కొన్న కుమార్తెల్లో పెద్దామె ఆఫ్రీన్‌ను కూడా కాల్చి హతమార్చాడు. చిన్న కుమార్తె సహరీన్‌ను గొంతు నులిమి చంపినట్లు పోలీసులకు తెలిపాడు. హత్యల అనంతరం ముగ్గురి మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు.
గ్రామస్తులు, బంధువులను మభ్యపెట్టేందుకు తాను భార్య, పిల్లలతో కలిసి షామ్లీలో అద్దె ఇంట్లో ఉంటున్నానని అబద్ధం చెప్పాడు. అయితే రోజులు గడిచినా తాహిరా, పిల్లల జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యుల అనుమానం బలపడింది. మంగళవారం సాయంత్రం ఫారుక్ సూచనలతో పోలీసులు సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. చివరకు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.



