గాజా, డేర్ అల్ బలాహ్ : దక్షిణ గాజాలోని నాజర్ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ జరిపిన తాజా దాడిలో ఆరుగురు జర్నలిస్టులతో సహా 20మంది మరణించినట్టు అధికారులు సోమవారం తెలిపారు. మృతుల్లో పలువురు డాక్టర్లు, పౌర రక్షణ దళ సభ్యులు కూడా వున్నారు. అంతకుముందు జరిగిన దాడుల్లో గాయపడిన వారికి వారు చికిత్సనందిస్తుండగా ఈ దాడి జరగడంతో వారంతా మరణించారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. గత 24గంటల్లో గాజా వ్యాప్తంగా జరిగిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 58కాగా, 308మంది గాయపడ్డారు. వీరిలో 28మంది ఆహారం కోసం వెళ్లి మృత్యువాత పడినవారే, ఆ దాడుల్లో 184మంది గాయపడ్డారు. ఆస్పత్రిపై దాడులు క్రిమినల్ చర్యలని, ఇదేదో ప్రమాదవశాత్తూ జరిగిన దాడి కాదని ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడులని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నాజర్ ఆస్పత్రిపై దాడిని ఇజ్రాయిల్ ఆర్మీ ధృవీకరించింది. కానీ ఆస్పత్రిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయమై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
పలు పత్రికలకు చెందినవారు
మృతుల్లో అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి)లో ఫ్రీలాన్సర్‌గా విధులు నిర్వహిస్తున్న మరియం దగ్గా (38) కూడా ఉన్నారని అన్నారు. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మరియం దగ్గా ఎపిలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కేవలం ఆకలితో మృత్యువుకు దగ్గరవుతున్న చిన్నారులను కాపాడేందుకు నాజర్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారని గతంలో దగ్గా వార్తా కథనాలు ఇచ్చారు. నాజర్ ఆస్పత్రిపై జరిపిన దాడిలో తమ జర్నలిస్ట్ మహమ్మద్ సలాం ఉన్నారని అల్‌జజీరా ధృవీకరించింది. కాంట్రాక్ట్ కెమెరామెన్ హుస్సామ్ అల్-మస్రీ కూడా మరణించారని రాయిటర్స్ పేర్కొంది. మరో కాంట్రాక్ట్ ఫొటోగ్రాఫర్ హతేమ్ ఖలీద్ గాయపడ్డారని తెలిపింది.
192మంది జర్నలిస్టులు మృతి
22 నెలలుగా కొనసాగుతున్న గాజా దాడుల్లో మొత్తంగా 192మంది జర్నలిస్టులు మరణించారని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె) తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు 18మంది మరణించారని సిపిజె పేర్కొంది. కాగా, గాజా నగరంలోని జీటూన్, సాబ్రా ప్రాంతాల్లో ఇజ్రాయిల్ ఆర్మీ దాడులను ఉధృతం చేసింది. మొత్తంగా నగరాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తన ప్రణాళికలతో ముందుకు కదులుతోంది. మరోవైపు యెమెన్ రాజధాని సానాపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆరుగురు మరణించగా, 86మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్ కృత్రిమంగా కల్పించిన కరువుతో చిన్నారులు చనిపోకుండా తామేం చేయలేకపోతున్నామని డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.
లెబనాన్ నుంచి వైదొలగుతాం
హిజ్బుల్లా ఆయుధాలు విడనాడితే తాము లెబనాన్ నుండి వైదొలగుతామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. గత 14మాసాలుగా కొనసాగుతున్న దాడిలో పోరాడిన ఈ గ్రూపును నిరాయుధురాలిని చేయాల్సిందిగా అమెరికా నుండి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా అందుకోసం కృషి చేస్తామని లెబనాన్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది, దాన్ని నెతన్యాహు స్వాగతించారు.
నాజర్ ఆస్పత్రిపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES