– పలువురికి గాయాలు
నవతెలంగాణ-హయత్ నగర్
స్థల వివాదంలో ఏర్పడిన గొడవలో ఇరు గ్రూపులు కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కోహెడ గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 951, 952లో 7.28 ఎకరాల భూమి ఉంది. దాని గురించి ప్లాట్ ఓనర్లు బద్రి అశోక్, సత్యనారాయణ రెడ్డి, రఘు ఇంకా కొంతమందికి.. సంరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.అసలు భూయజమానులు కంగుల రాములు, పోచయ్య, మరి కొంతమంది కలిసి కంగుల గండయ్య, కంగుల ఈదయ్యకు సాధారణ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) మంజూరు చేశారు. ఆ భూమిని 1970లో లేఅవుట్ చేసి 170 ఓపెన్ హౌస్ ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఆ తరువాత కంగుల కుటుంబ వారసులు ఆ జీపీఏ చట్టబద్ధంగా చెల్లదని, ఆ భూమిని 2013లో సంరెడ్డి బాల్‌రెడ్డికి విక్రయించారు. దాంతో 2014 నుంచి భూవివాదం నడుస్తోంది. ప్లాట్ యజమానులు ఓఎస్ నెం:839/2015ను అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు, ఎల్బీనగర్‌లో దాఖలు చేయగా.. 28.03.2025న వారికి శాశ్వత ఆజ్ఞ ఆర్డర్ ఇచ్చారు. అలాగే, సంరెడ్డి బాల్‌రెడ్డి 19.02.2025న పోలీసు జోక్యాన్ని నిరోధిస్తూ రిట్ పిటిషన్ 3790/2025 హైకోర్టులో దాఖలు చేయగా.. పోలీస్, హైడ్రా జోక్యం చేసుకోకుండా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం ప్లాట్ యజమానులు సత్యనారాయణ రెడ్డి, బద్రి అశోక్, రఘు, కుమారి, గణేష్, వెంకట్ రెడ్డి, మరికొంత మంది తమకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందని జేసీబీతో వచ్చి వారి ప్లాట్లను శుభ్రం చేసుకుంటున్నారు. అది తెలుసుకుని సంరెడ్డి బాల్‌రెడ్డి, సంరెడ్డి దిలీప్‌రెడ్డి, శీలం శ్రీను, మరొకరు అక్కడకు వచ్చి ప్లాట్ యజమానులతో గొడవపడ్డారు. కర్రలు, రాళ్లు, గడ్డికోసే కత్తితో దాడికి దిగారు. ఈ ఘర్షణలో ప్లాట్ యజమానులు సత్యనారాయణ తలకు, నవీన్ చిటికన వేలుకు, వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ గొడవలో సంరెడ్డి బాల్‌రెడ్డిని కూడా ప్లాట్ ఓనర్స్ కర్రలు, రాళ్లతో కొట్టగా అతని తలకు గాయాలయ్యాయి. పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
స్థల వివాదంలో కత్తులు, రాళ్లతో దాడి
- Advertisement -
RELATED ARTICLES