Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅరబిందో ఫార్మాను ఆదివారం తగులబెడతా

అరబిందో ఫార్మాను ఆదివారం తగులబెడతా

- Advertisement -

– అధికారులకు, అరబిందోకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
– అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు
– రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇక చూస్తూ ఊరుకోలేను
– మీడియాకు ఫోటోలు, వీడియోలు విడుదల
నవతెలంగాణ -జడ్చర్ల

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం ముదిరెడ్డిపల్లి శివారులోని అరబిందో ఫార్మా నుంచి వస్తున్న వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఫార్మాని తగలబెడతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం తన కుటుంబంతో కర్నాటక యాత్రలో ఉన్న అనిరుధ్‌ రెడ్డి ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరబిందో ఫార్మా నుంచి వస్తున్న వాయు కాలుష్యంపై అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా, జిల్లా స్థాయి అధికారులను పలుమార్లు హెచ్చరించినా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదలడం ఆపడం లేదన్నారు. ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలికి ఒక్క రోజు టైమ్‌ ఇస్తున్నానని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చర్యలు తీసుకోకపోతే ఆదివారం 11గంటలకు అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి ఆ కంపెనీని తగులబెడతానని హెచ్చరించారు. పోలేపల్లి ఫార్మా సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న కారణంగా పంటలు పండటం లేదన్నారు. చెరువులో ఉన్న చేపలు కూడా చనిపోతున్నాయని తెలిపారు. తాను గతంలోనే అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. ఈ విషయంలో అధికారులకు, అరబిందో ఫార్మాకు మధ్య ఏ లాలూచీ ఉందో తనకు తెలియదన్నారు. మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని గతంలోనే తాను హెచ్చరించానని గుర్తు చేశారు. అయినప్పటికీ తన హెచ్చరికలను పెడచెవిన పెట్టి అరబిందో ఫార్మా కంపెనీ మళ్లీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేశారు. కలుషిత జలాలను చెరువులోకి వదలడం వెంటనే ఆపాలని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -