– జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ లతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అధికారులు, బాన్స్వాడ సబ్ కలెక్టర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లాలో అధిక వర్షాలు వరద పరిస్థితిపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ జిల్లాలో భారీ వరద నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగుచర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, చెరువులు పూర్తిగా నిండి నీటిని కిందికి వదిలినప్పుడు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రిలీఫ్ క్యాంపులకు పంపించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలోకి చేరిన వరద నీరును త్వరగా బయటకు పంపించే ఏర్పాటు చేయాలని, బాధితులను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని అన్నారు. తడిచిన ఇండ్లు ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉన్నందున వర్షాలు తగ్గు ముఖం పట్టిన కూడా ఆయా ఇళ్లలో ప్రజలు నివాసం ఉండకుండా చూడాలన్నారు.
వంగిన విద్యుత్ స్తంభాలు, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, పాడుపడ్డ భవనాల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలని, వ్యవసాయ, విద్యుత్తు, ఆర్, బి, పంచాయతీ రాజ్, గ్రామపంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయా శాఖల ద్వారా తగు చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ కు లీకేజ్ లేకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రమాదకరమైన బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద నుండి ప్రజలు ప్రయాణాలు కొనసాగించకుండా గట్టి పోలీసు వద్ద వస్తే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ జిల్లాలో వాగులు విపరీతంగా ప్రవహిస్తున్నాయని నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులనుండి నీరు వదిలే ముందు పరివాహన గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు.
ఉమ్మడి నిజామాబాబాద్ ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ మాట్లాడుతూ రిలీఫ్ కేంద్రాలకు వరద బాధితులను తరలించి వారికి ఇబ్బంది కలగకుండా పరిశుభ్రంగా ఆహారం వండి వేడిగా వడ్డించాలని అన్నారు. నిజంసాగర్ కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని వదలాలని అన్నారు. నిన్నటి రోజున వచ్చిన వరద ఆకస్మికంగా వచ్చింది కానీ గురువారం మాత్రం రెడ్ , యెల్లో అలర్ట్ జారీ చేసిన తర్వాత వర్షం కురుస్తుంది కాబట్టి ఎలాంటి అవాంఛనియా సంఘటనలో జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. పైనుండి వరద నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ కాజ్వేల్, బ్రిడ్జిల వద్ద 100 నుండి 200 మీటర్ల దూరంలోనే ట్రాఫిక్ ని ఆపేసి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని తెలిపారు.
వర్షం వల్ల భూమి చిత్తడిగా మారి ఇబ్బందిని కలుగజేస్తాయని పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ నిజం సాగర్ నుండి అధిక మొత్తంలో నీటిని వదులుతున్నందున పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలనీ, బాన్స్వాడ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులతో సమీక్షిస్తూ రిలీఫ్ కేంద్రాలను నిర్వహించాలని, ప్రమాదకరమైన లో లెవెల్ కాజ్వే లు, కల్వర్టుల వద్ద ప్రజలు ప్రయాణం చేయకుండా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, శుద్ధమైన త్రాగునీరు, నిరంతరాయ విద్యుత్తు సరఫరయ్యేలా చూడాలని, వరద నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.