- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలని తెలిపారు.ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతి కార్యాలయంలోని ఫైల్స్ అన్ని సక్రమంగా ఉంచుకోవాలని ప్రతి కార్యాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేయాలని, కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయంలో ఫైల్స్ సరిగా లేకపోయినా, శుభ్రంగా ఉండని కార్యాలయాల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 28 దరఖాస్తులు, మున్సిపాలిటీ 6, డిఆర్డిఏ 4, డిపిఓ 4, మిగిలిన 20 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 58 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జడ్పీ శిరీష ఆర్డీవో వేణు మాధవరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ..
తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 11న నల్గొండలో నిర్వహించనున్న ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.
సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 11న నిర్వహించే ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు అంకురాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ చేపట్టిన ఇన్నోవేషన్ పంచాయితీ కార్యక్రమం ఈ నెల 11న నల్గొండ ఐటి టవర్ లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుండి ఆవిష్కర్తలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని, ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం అవిష్కర్తలకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు ఇన్నోవేషన్ పంచాయితీ ప్రత్యేక వేదికగా నిలుస్తుందన్నారు.
పరిశ్రమల ఏర్పాటు పై సందేహాలు ఉన్న రాష్ట్రంలోని వ్యవస్థాపక నిపుణులతో సలహాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న అవిష్కర్తలకు వనరులు ఉండేలా స్పష్టమైన సహాయాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు నిపుణులతో చర్చించవచ్చని, వ్యాపారం సవాళ్ళను అక్కడిక్కక్కడే పరిష్కరించడం జరుగుతుందని కావున జిల్లాల నుండి ఔత్సాహిక వ్యవస్థాపకులు పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా పరిషత్ సీఈవో శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణు మాధవరావు, సిపిఓ కిషన్, సిఎఫ్ఓ సతీష్, ఈడియం అమిద్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రణయ్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.




