నవతెలంగాణ-కంఠేశ్వర్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఐఎంఏ తెలంగాణ మెంటల్ హెల్త్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా డా. విశాల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌లో చిన్న పిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు, న్యూరోసైకియాట్రిస్ట్ ప్రొఫెసర్ డా. విశాల్ ఆకుల మాట్లాడుతూ.. ఆటిజం అనేది చిన్న పిల్లల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన మానసిక అభివృద్ధి సమస్య అని, ఇటువంటి పిల్లలు తమ భావాలను, సంతోషాన్ని, బాధను ఇతరులకు వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారని తెలిపారు. వారు ఇతరులతో కలిసిపోవడంలో కష్టపడటం, మాటల్లో ఆలస్యం, ఒకే పనిని పదే పదే చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను కొందరు సమాజంలో అపోహలతో మంత్రము లేదా చేతబడి చేశారని భావించి మాంత్రికులు, తాంత్రికుల వద్దకు తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమని, ఇది సమయం, డబ్బు వృథా చేయడమే కాకుండా పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆటిజం గురించి అవగాహన కల్పించడం సమాజపు బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది మొదటి దశలోనే ఈ లక్షణాలను గుర్తించి సరైన వైద్యుడిని సంప్రదిస్తే, సరైన థెరపీలు మరియు మందులతో పిల్లలలో మంచి మార్పు తీసుకురావచ్చని చెప్పారు. ఆటిజం ఉన్న పిల్లలు బలహీనులు కాదు — ప్రత్యేకమైన ప్రతిభ కలిగినవారు అని, వారికి ప్రేమ, సహనం, ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారు సమాజంలో తమ ప్రతిభను నిరూపించగలరని తెలిపారు. సమాజం వారికి అండగా నిలబడితేనే వారి జీవితాలు వెలుగొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా. విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డా. హరీష్ స్వామి, డా. కె. శ్రీశైలం, డా. టీ. జీవన్ రావు, డా. వినోద్ కుమార్ గుప్తా, డా. రమణేశ్వర్ , సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆటిజం పై అవగాహన ప్రతి చిన్నారి భవిష్యత్తుకు వెలుగు అనే సందేశంతో ఈ కార్యక్రమం సమాజానికి ఒక మంచి మార్గదర్శకంగా నిలిచింది.



