దస్‌క శాసన్ నబ్బే పర్ నహీ చలేగా నహీ చలేగా
సౌమె నబ్బే శోషిత్ హై నబ్బే భాగ్ హమారా హై
ధన్, ధర్తీ ఔర్ రాజ్ పాత్‌మె, నబ్బేభాగ్ హమారాహై
ఇవి 1970లలో దేశ వ్యాప్తంగా జనాన్ని ఉర్రూత లూగించిన నినాదాలు. అవి వినబడగానే వాటికి రూపకల్పన చేసిన ప్రజానాయకుడు జగదేవ్ ప్రసాద్ గుర్తుకొస్తాడు. మార్క్స్-లెనిన్ ఆలోచనా విధానంతో ఈ దేశంలోని అణగారిన వర్గాలకు ఆశాదీపంగా వెలిగిన పీడిత వర్గాల నాయకుడు బాబు జగదేవ్ ప్రసాద్ (2ఫిబ్రవరి 1922-5 సెప్టెంబర్ 1974). లెనిన్ అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేసిన మహనీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో మన దేశానికి ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి చెందిన బాబు జగదేవ్ ప్రసాద్ కుష్వా ఒకరు.
తొంభయి మీద పది అధికారం
నడవదు నడవదు నడవనివ్వము
వందలో తొంభయి మా అణగారిన జనానిదైతే,
ఇక తొంభయి పాళ్లు మాదేగా-
భూమీ, సంపద అధికారంలో తొంభయి వంతులు మాదేలే!
అని నినదించిన జగదేవ్ ప్రసాద్ తాడిత, పీడిత, అణగారిన ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, శోషిత్ సమాజ్ దళ్ (ఎస్‌ఎస్‌పీ) పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పి, భారతీయ రాజకీయ రంగంలో విప్లవాలకు దారులు వేసినవాడు. మొదట బీహార్ సామాజిక ఉద్యమనేతగా, తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపడం వల్ల ఆయన్ను మార్క్స్, లెనిన్ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే వారసుడిగా చూశారు. మొదట 1967 ప్రాంతంలో రాం మనోహర్ లోహియా ఆలోచనా విధా నం నచ్చి కొంతకాలం ఆయనతో కలిసి పనిచేశాడు. తర్వాత విభే దించి, స్వతంత్రంగా శోషిత్ సమాజ్ దళ్‌ను ఏర్పాటు చేశాడు.
జగదేవ్ ప్రసాద్ తండ్రి ప్రయాగ్ నారాయణ్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉంటూ వ్యవసాయం చేసేవాడు. తల్లి రస్కలి – గృహిణి. వ్యవసాయ పనులు కూడా చేస్తుండేది. వీరిది డాంగి కులంలో కొయెరీ(కుష్వా) ఉపకులానికి చెందిన (ఓబీసీ) పేద కుటుంబం. అయినా కొడుకుపై గల ప్రేమ వల్ల, అతనికి మంచి బట్టలు కుట్టించి మంచి విద్యను అందించారు. జగదేవ్‌ప్రసాద్ కుష్వా స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే అగ్రవర్ణాల అహంకారానికి గురయ్యాడు. ఒకరోజు తెల్లని శుభ్రమైన బట్టలువేసుకుని స్కూలుకు వెళుతూ ఉంటే- వీడేమిటి తక్కువ కులం వాడు ఇలా డాబుగా వెళుతున్నాడని అగ్రవర్ణం పిల్లలు వెంటపడి ఎగతాళి చేశారు. ఉక్రోషంతో జగదేవ్ వాళ్లలో ఒకణ్ణి పట్టుకుని పిడిగుద్దులు గుద్దాడు. గుంపు చెదిరిపోయింది. అయితే ఆ విషయం ఊళ్లో పెద్ద చర్చకు దారి తీసింది. చివరికి జగదేవ్ తండ్రి- పై వర్గం వారికి క్షమా పణలు చెప్పుకుని, జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది.
బుద్ధగయకు దగ్గరలో బీహార్‌లోని జహనాబాదు జిల్లాలోని కుర్హరి గ్రామంలో పుట్టిన జగదేవ్ ప్రసాద్, పాట్నా విశ్వవిద్యాలయం నుండి సాహిత్యం, ఆర్థిక శాస్త్రాలతో పట్టా తీసుకున్నాడు. తర్వాత అక్కడి నుండే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్వీకరించాడు. ఆ కాలంలోనే చంద్రదేవ్ ప్రసాద్‌వర్మతో పరిచయం ఏర్పడింది. ఆయన సూచనతో విపరీతంగా పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. రాజకీయ శాస్త్రం, తత్త్వ శాస్త్రం సామాజిక శాస్త్రాల అధ్యయంతో ఆయన ప్రాపంచిక దఅక్కోణంలో చాలా మార్పువచ్చింది. తొలి నాళ్ల నుండి విప్లవ భావాలు గల జగదేవ్, మొదటి తన గ్రామంలో ఉన్న ‘పంచ్ కతీయ’ వ్యవస్థను ఎదిరించాడు. అదేమిటంటే ప్రతి రైతు తన పొలంలో పండిన వారి కట్టలు (లేదా ధాన్యం కట్టలు) పెత్తందారు ఏనుగుకు వదిలేయాల్సి వచ్చేది. ఏనుగు ఆ ప్రాంతపు పెత్తందారుది. దానితో పని చేయించుకునేది అతను-కానీ, దాని తిండి బాధ్యత ప్రతి పేదరైతూ భరించాల్సి వచ్చేది. అందులోని అన్యాయాన్ని మొదట జగదేవ్ ప్రసాద్ అడ్డుకున్నాడు. ఆ తిరుగు బాటే క్రమంగా విస్తృతరూపం దాల్చింది. శతాబ్దాలుగా బహుజనుల్ని పీడిస్తూ అధికారం అనుభవిస్తున్న అగ్రవర్ణ అల్ప సంఖ్యాకుల ఆటకట్టించి, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన స్థాయి, గౌరవం, హోదా సాధించుకోవాల్సిన అవసరాన్ని బాబు జగదేవ్‌ప్రసాద్ తన ‘బీహార్ ఉద్యమం’ ద్వారా ఈ దేశ ప్రజలకు ఎలుగెత్తి చెప్పాడు.
1970 నాటి తొలినాళ్లలో రామ్ స్వరూప్ వర్మ ‘అర్జిత్ సంఫ్‌ు’ను ప్రారంభించాడు. ఆర్జిత్ సంఘమంటే- కష్టపడి, సంపాదించుకుని స్వతంత్రంగా జీవించే వారికోసం, వారి హక్కులు కాపాడడం కోసం ఈ సంఘం ఏర్పడింది. అర్జక్-అంటే కష్టపడి చెమటోడ్చి న్యాయబద్ధంగా సంపాదించు కునేవారు. కష్టపడకుండా అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా చేసి, మోసపూరితంగా పెత్తనం సాగిస్తున్న బ్రాహ్మణిజపు నడ్డి విరగ్గొట్టడానికి రూపొందిందే – అర్జక్ సంఫ్‌ు, జగదేవ్ ప్రసాద్ స్థాపించిన శోషిత్ సమాజ్ దళ్ ధ్యేయం కూడా అదే గనుక, రామ్ స్వరూప్ వర్మతో కలిసి అర్జక్ సంఫ్‌ు నిర్వహణలో కూడా జగదేవ్ చురుకుగా పాల్గొన్నాడు. ఒకవైపు శోషిత్ సమాజ్ దళ్, మరోవైపు అర్జక్ సంఫ్‌ు ప్రభావంతో సమాజంలో త్వరితగతిన కొన్ని మార్పులు కనిపించాయి. కుష్వా జాతి వారు తమ ఇళ్లలో చేసుకునే అన్ని రకాల కార్యక్రమాలకు బ్రాహ్మణ పురోహితుల్ని పిలవడం మానేశారు. దానితో మూఢ నమ్మకాల నిర్మూలన క్రమంగా కొనసాగుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో జగదేవ్ తన ఉపన్యాసాల్లో చెబుతూ ఉండేవాడు. ”అబ్‌కి సాల్‌కి బాధోమే, గోరి ఉంగ్లీ కొడోమె”-అని! అంటే అగ్ర వర్ణానికి చెందిన మహిళల తెల్లని నాజూకు వేళ్లు వచ్చే సంవ త్సరం నుండి వరినాట్లు వేస్తుంది అని! బహుజనులంతా వెట్టిచాకిరి చేయడం మానేస్తే ఏం చేస్తారు? వచ్చి, తమ తమ పొలాల్లో వరినాట్లు వేసుకోవాల్సిందే కదా? అని. వాళ్లు కూడా శ్రమసంస్కృతిలో భాగస్వాములు కాక తప్పదు- అని నర్మగర్భంగా చెప్పడమన్న మాట!
పత్రికా రచయితగా ఆయన కలం చాలా చురుకుగా పనిచేసేది. సమస్యల మీద తీక్షణంగా గురిపెట్టేది. ఆ పని లోనే జగదేవ్ ప్రసాద్ మన హైదరాబాదుకు వచ్చాడు. ఇక్కడి ‘ఉదరు’- ‘సిటిజన్ ‘పత్రికలకు సంపాదకు డయ్యాడు. ఆ కాలంలో ఆయన ఆలోచనా ధోరణి దక్షిణాది రాష్ట్రాలకు పాకింది. పత్రికా రంగంలో ఆ పత్రికలకు మంచి గుర్తింపూ ప్రజాదరణా లభిస్తున్న సమయంలో మనువాదులు ఆయన మీద ఆయన పత్రికాఫీసుల మీద దాడులు చేయడం ప్రారం భించారు. కొత్త స్థలం, కొత్త వాతావరణం, కొత్త మనుషుల మధ్య నిలదొక్కుకోలేక, ఇక్కడి ఉద్యోగం మానేసి, హైదరా బాదు వదిలి, మళ్లీ పాట్నాకు వెళ్లిపోయాడు, అక్కడి రాజ కీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు.
సమాజంలో అణగారిన వర్గాలు దారుణంగా దోపిడీకి గురవుతూ ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, హక్తుల కోసం గొంతెత్తాల్సిన పనిలేదా? ఉద్యమించి హక్కులూ, అధికారం సాధించుకోవాల్సిన పనిలేదా? అని జగదేవ్ ప్రసాద్ ప్రశ్నించేవాడు. ఉద్యోగ భరితమైన ఉపన్యాసాలతో జనంలో కొత్త ఉత్సాహాన్ని నింపేవాడు. మనుషులుగా సమానస్థాయి సంపాదించుకోవడానికి పోరాటం అనివార్యమైనప్పుడు పోరాడవల్సిందేనని పిలుపునిచ్చేవాడు.
నెహరోంసే డర్‌కర్ నౌకా ఫార్ నహీ హోతీ
కోషిశ్ కర్‌నే వాలోంకి కభీ హార్ నహీ హోతి
(ప్రవాహానికి భయపడితే నౌక ఆవలి తీరం చేరదు
ప్రయత్నం చేస్తూ ఉండే వాడికి ఓటమనేది ఉండదు)
జిన్ కొ పడ్ గయీ హై ఝక్కె చాలానేకి
ఉన్ కె సిర్ పర్ కభీ తాజ్ నహీ హాతా
(వంగి వంగి నడవడం అలవాటు పడ్డ వాడి
తల మీద కిరీటం ఎప్పటికీ రాదు)
ఊంచ్ నీచక భేదన మానే, ఉంచ్ నీచ్‌క భేద్‌న జానే
వహీ శ్రేష్ఠ్ జ్ఞానీ హై
(ఎక్కువ తక్కువల భేదం ఒప్పనివాడు
ఎక్కువ తక్కువల బేధం చెప్పనివాడు
అతడే పో ఉత్తమ జ్ఞాని!)
ఈ కవితా చరణాల సారాంశమే జగదేవ్ ప్రసాద్ ఉపన్యా సాల్లో ఉండేది. మనువాదులకు భజనలు చేస్తూ తిరిగే నేటి బహుజనులు నేర్చుకోవాల్సిన విషయాలు, ఆలోచించాల్సిన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి.
ఇక జగదేవ్‌ప్రసాద్ బీహార్ ఉద్యమం విష యానికి వస్తే ఆయన జీవించిన కాలంలోనే కొంత సాధించగలిగాడు. తర్వాత తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఉద్యమం మరింత ముందుకు పోవాలను కున్నాడు. సామాజిక, సాంస్కృతిక రంగాల మీద ప్రభావం చూపుతూ తన శోషిత్ సమాజ్‌దళ్‌తో బీహార్ రాజకీయాలను మార్చేశాడు. మొదటిసారి అక్కడ పూర్తిగా వెనుకబడిన జాతులతో ప్రభుత్వం ఏర్పడటానికి కారకుడయ్యాడు. జగదేవ్ బావమరిది సతీష్ ప్రసాద్‌సింగ్ ఎస్.ఎస్.పి. నేపథ్యంతో కొంతకాలం బీహార్ ముఖ్యమంత్రి కాగలిగాడు. జగదేవ్ ప్రసాద్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అయితే, ప్రభుత్వం మారిపోయిన తర్వాత, ఆయన జీవితం విషాద భరితంగా ముగిసింది. అందుకు కారణం మనువాదుల కుట్ర అని అందరికీ తెలిసిపోయింది.
బీహార్ ఉద్యమంలో భాగంగా జగదేవ్‌ప్రసాద్ పలుచోట్ల ఉపన్యసిస్తుండేవాడు. ఒకసారి జహనాబాద్ జిల్లా కుర్తాలో వేలమందితో ఊరేగింపు తీసి, వేదికమీది నుండి ఉపన్యాసం ప్రారంభించాడు. నలువైపుల నుండి పోలీసులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. అది గమనించి కూడా జగదేవ్‌ప్రసాద్ చలించలేదు. దోపిడీకి గురవుతున్న వారి హక్కుల కోసం తీవ్ర స్వరంతో ఉపన్యసిస్తూనే ఉన్నాడు.ఇంతలో పోలీసు తుపాకి పేలింది. గుండు జగదేవ్‌ప్రసాద్ మెడలోకి దూసుకు పోయింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినవాడి మీద ఒక పోలీసు కాల్పులు జరపగలడా? జరపలేడు. కానీ, వెనక ఎవరో ఉండి, ఆయన్ను తుదముట్టించాలన్న పథకం ప్రకారమే ఫైరింగ్ ఆర్డర్ ఇప్పించి ఉంటారన్నది ధృవపడింది. నిస్పం దేహంగా అది రాజకీయ హత్య అని మీడియా, దేశప్రజలు గగ్గోలు పెట్టారు. అంతటి మహా నాయకుడు తయారు కావడం మామూలు విషయం కాదని హత్య చేయించిన మను వాదులకు తెలుసు. గాయపడి కుప్పకూలిన జగదేవ్‌ప్రసాద్‌ను ఆస్పత్రికి కాకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన దాహం దాహం అని తల్లడిల్లుతూ ఉంటే-బరి తెగించిన మనువాద పోలీసు ఉద్యోగి ఆయన మీద మూత్రం పోశాడు. ఆలోచనా విధానంలో తేడాలున్నంత మాత్రాన ఉద్యమకారుణ్ణి ఇంత నీచంగా అవమానిస్తారా? మనువాదుల అమానీయ చర్యల్ని ఆనాడు జనం ప్రత్యక్షంగా చూశారు. ఇంతా చేస్తే ఇది జరిగింది బుద్దగయకు సమీపంలో ఉన్న ఒక ఊరు. జగదేవ్ ప్రసాద్ బతికి ఉన్నప్పుడు తరచూ ఒక మాట చెప్పేవాడు- ”ఈ ఉద్యమంలో తొలితరం వారు చంపబడతారు. మలితరం వారు జైలుకెళ్తారు. పరిస్థితులు చక్కబడితే, మూడోతరం రాజ్యాధికారం చేజిక్కించు కుంటుంది” -అని! భారత ప్రభు త్వం ఆయన కృషిని గురించి 2001లో తపాళా బిళ్ల విడుదల చేసింది. ఆయన స్మృతిలో ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. పాట్నాలో ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు.
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి జాతీయ
పురస్కార తొలిగ్రహీత.
డాక్టర్ దేవరాజు మహారాజు