నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై సందడి చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన బాలకృష్ణకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
దర్శనం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. “లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను” అని ఆయన తెలిపారు. అమ్మవారి దృష్టిలో అందరూ సమానమేనని, ఆమె ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని కొనియాడారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, నిరంతరాయంగా దర్శనం కల్పించడం అభినందనీయమని దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.