జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ఏక్‌దమ్మున పాతిక పుస్తకాలను నిషేధిం చడం, ఆవెంటనే వాటిని జప్తు చేసేందుకు పుస్తకశాలలపై దండ యాత్రలకు పోలీసులకు ఆదేశాలివ్వడం ప్రపంచవ్యాపిత చర్చకు దారితీసింది. మోడీ హయాంలో నిషేధాలు, ఆంక్షలు పరిపాటిగా మారిన మాట నిజమైనా భారతదేశ ప్రజాస్వామిక సంప్రదాయాల రిత్యా ఇంత నిరంకుశమేంటనే ప్రశ్న ప్రతిధ్వనించింది. విచిత్రమేమంటే నిషేధం తర్వాత ఈ రెండోరోజు దేశీయ మీడియా ముఖ్యంగా బడామీడియా ఆ అంశంపై గప్‌చిప్‌గా ఉండగా గార్డియన్, అల్ జజీరా తదితర అంతర్జాతీయ మీడియా దీనిపై విస్తతంగా కథనాలిస్తున్నాయి. ఎమర్జెన్సీ యాభ య్యవ వార్షికం జరుపుతూ తామే ప్రజాస్వామ్య పరిరక్షకులమైనట్టు ఊరేగుతున్న మోడీ సర్కారు నిజ స్వరూపాన్ని ఈ నిషేధం బట్టబయలు చేసింది. ఏమంటే ఎమర్జెన్సీలో కూడా ఒకేసారి ఇన్ని రకాల పుస్తకాలను నిషేధించే ఉత్తర్వు వచ్చి ఉండదు. దీనిపై మీడియా పెద్దగా స్పందించడం లేదంటే అప్రకటిత ఎమర్జన్సీ అంటే ఏమిటో అర్థమవుతున్నది.
కాశ్మీర్‌కు రాజ్యాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 370వ అధికరణాన్ని రద్దుచేసి ఆరేళ్లు పూర్తయ్యాయని హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సహా బీజేపీ-ఎన్డీయే నాయకులు కీర్తనలాలపిస్తున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం ప్రత్యేకంగా గమనించదగింది.అమిత్‌షా సమర్థత వల్ల కాశ్మీర్‌లో పరిస్థితి ఎన్నడూ లేనంతగా అదుపులోకి వచ్చిందని ఎన్డీయే సమావేశంలో జబ్బలు చర్చుకున్నారు. పహల్గాం ఘాతుకం తర్వాత అంతా వేగంగా సర్దుబాటు చేసినందుకు మోడీకి సత్కారమే చేశారు. మరోవంక గతవారం రోజులుగా ఉగ్రవాదుల ఏరివేత అంటూ వేట సాగిస్తున్నారు.ఇవన్నీ నిజమే అయితే ఎప్పటెప్పటివో ఈ పుస్తకాల వల్ల కలిగిన ప్రమాదమేముంటుంది? వాటిలో కొన్ని కొన్ని దశాబ్దాల కిందటి పరిస్థితిని వివరించేవే తప్ప తాజాగా రాసినవి కూడా కాదే? యువతను పక్కదోవ పట్టిస్తున్నాయని, ఉగ్రవాదులను గొప్పచేసి, సాయుధ దళాలను విలన్లుగా చూపిస్తూ తప్పు కథనాలు యువత బుర్రలో జొప్పిస్తున్నాయనే ఆరోపణతో నిషేధించడమంటే యువత అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోకతప్పదు. మరినిజంగా మోడీ,షా ద్వయం అంత అద్భు తంగా కాశ్మీర్‌ను బాగుచేసి ఉంటే వారి తరపున యువత నిలబడేవారు తప్ప ఎవరో రాసిన పుస్తకాలతో కొట్టు కుపోతారా? కనక అక్కడ పరిస్థితి అదుపులోకి రావడమో లేక యువతను అవి పక్కదోవ పట్టించడమో ఏదో ఒకటి అబద్దమై ఉండాలి.
వాస్తవానికి ఈ పుస్తకాలు రాసిన వారెవరూ అల్లాటప్పా రచయితలు కాదు. విశ్వవిద్యాలయాల్లో అధ్యా పకులూ న్యాయశాస్త్రంలో ఆరితేరిన అధ్యయన పరులు, పత్రికారంగంలో పట్టున్న పరిశోధకులని ఆ జాబితా చూస్తేనే తెలుస్తుంది.
తాము ఏ ఉగ్రవాదాన్ని సమర్థించలేదనీ, సాయుధ దళాలపై దాడిచేయడం అసత్యమనీ వారిలో చాలా మంది నిషేదం తర్వాత నిష్కర్షగా చెబుతున్నారు. పైగా వాటిని పాలకులే వివిధ సందర్భాల్లో మెచ్చుకోవడం గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు డేవిడ్ దేవదాసు రాసిన భవిష్యత్తుకోసం అన్వేషణ(ఇన్ సర్చ్ ఆఫ్ పీస్) అనే గ్రంథాన్ని 1988లో ఎన్డీయే మాజీ కన్వీనర్, రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జిఫెర్నాండెజ్ స్వయంగా ఆవిష్కరించారు.మరి కొన్నింటిని మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రశంసించారు. అరుంధతీ రారు ప్రతిష్టాత్మకమైన బూకర్ పురస్కారం పొందిన శక్తివంతమైన రచయిత్రి.మానవ హక్కులకోసం పోరాడే వ్యక్తి. ఎజి నూరానీ అయితే రాజ్యాంగ సభ చర్చలనుంచి నాయకుల వ్యాఖ్యలు, ప్రసంగాలు, రచనల వరకూ తుచ తప్పకుండా ఉటంకిస్తూ తప్ప ఏమీ చెప్పరు. ఆయన కాశ్మీర్ సమస్య 1947-2012 వరకూ రాశారు గనక మోడీ సర్కారే లేదు. అలాంటప్పుడు 2025లో అదిచేసే వ్యతిరేక ప్రచారం ఏముంటుంది? మిగిలిన ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టోఫర్ స్నెడిన్ 1993 తర్వాత ప్రత్యేకించి పరిశీలించి రాశారు. తన గ్రంథంలో వీసమెత్తయినా రెచ్చగొట్టే సమాచారం లేదని ఆయన సవాలు చేస్తున్నారు.
కాశ్మీర్ సమస్య నిజమైనప్పుడు-దానిమీద భారత పాకిస్తాన్‌ల మధ్య వివాదాలు, ఘర్షణలు నడుస్తున్నప్పుడు.. దేశంలో పాలకపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, హురియత్ వంటివి విభిన్నవాదనలతో పనిచేస్తున్నపుడు ప్రభుత్వాల ఏర్పాటు కూల్చివేత, షేక్ అబ్దుల్లాతో సహా కీలక నేతల నిర్బంధాలు, విడుదల నడుస్తున్నప్పుడు రచయితలు వాటిని సృశించకూడదా? వారే ఆలోతు పాతుల్లోకి వెళ్లి రాయకపోతే ప్రజలకు విభిన్న కోణాలు, వాస్తవాలు ఎలా తెలుస్తాయి? పార్టీల వాదనలో ఏది నిజమో, ఏది పొరబాటో ఎలా తెలుస్తుంది? పాకిస్తాన్ కుట్రల వల్ల ఉగ్రవాదానికి ఊతం లభించి కల్లోలం నెలకొన్నమాట నిజమే. కానీ, దేశంలో పాలకుల అవకాశవాదాల మాటేంటి? మాటమార్పులేంటి? కలయికలు, ఫిరాయింపులు ఎన్ని జరగలేదు?వీటిని అక్షర బద్దం చేయడం రచయితల బాధ్యత కదా? వారితో పూర్తిగా ఏకీభవించకపోయినా చరిత్ర రాజకీయాలు రాజ్యాంగం కోణాలను ఆవిష్కరించడం మరింత కీలకం కదా?
ఇక్కడ పదేపదే సాయుధ దళాల ప్రసక్తి తీసుకురావడం సమస్యను పక్కదోవ పట్టించడమే. వాటికి ఉండేే విలువ, గౌరవం ఉంటాయి. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నిర్ణయాలు పాలనా వ్యవస్థ కీలకం తప్ప సైన్యం సాయుధ బలగాలు కాదు. కాశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలలోనూ కల్లోలిత ప్రాంతాల్లోనూ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్(ఎఎస్‌ఎస్‌పిఎ) కింద హక్కుల ఉల్లంఘనలు జరిగాయనే కేసులను పలు మార్లు సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది.నిజానికి ఇలాంటి సందర్భాల్లో వారిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని బీజేపీ భాగస్వామిగా ఉన్న పిడిపి మిశ్రమ ప్రభుత్వమే కోరింది. కానీ ఆ చట్టం కింద కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా వారిపై విచారణకు అనుమతించలేమని కోర్టు తేల్చిచెప్పింది.ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ప్రసిద్ధ రచయితలు వాటిని పరిశీలించి, పరిశోధించి రాయడం తప్పెలా అవుతుంది? నిషేధం ఎలా చెల్లుతుంది?
భారతీయ న్యాయసంహిత (బిఎన్‌ఎస్) 152, 196, 197 సెక్షన్ల కింద వాటిని హఠాత్తుగా నిషేదించడానికి నిజానికి రాజకీయ కారణాలే ఉన్నాయి. వాటిలో మొదటిది విమర్శకుల నోరు నొక్కడం. మరెవరూ అందుకు సిద్ధపడకుండా చూడటం. చిలకపలుకుల్లా తమ ఘనతలూ, గొప్పలూ పాడుకోవాలి తప్ప స్వంతంగా క్షేత్రస్థాయి పరిశీలించి విషయాలను నిబంధనలను విడమర్చి చరిత్ర కోణాలు చెప్పకూడదు. దేశంలో ఓట్ల చౌర్యం, మీడియాపై దాడులు,ఉద్యమాట అణచివేత, మైనార్టీ మతాలపై మహిళలపై దాడులూ ఏకకాలంలో జరగడం నిజానికి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం. ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు నిరాకరించి తర్వాత ‘సర్’ జరిపించేయడం కోసం దానికి ఒప్పుకుని, ఇప్పుడు ఇండియా వేదిక ఎన్నికల సంఘం భాగోతాన్ని బహిర్గతం చేసింది గనక దేశం దృష్టిని మళ్లించడానికి మరో అస్త్రం కావాలి. పహల్గాం పూర్వరంగంలో కాశ్మీరీల్లో వస్తున్న ప్రశ్నలకు సమా ధానాలు కావాలి. స్వయంగా ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గాంలో నిఘా వైఫల్యాలు నిజమని స్పష్టంగా ఒప్పుకున్నారు. వాటిని చక్కదిద్దుకుని రాష్ట్ర ప్రజల విశ్వాసం చూరగొనడం, యువతకు ఉపాధి కల్పనతో ఉత్సహపర్చడం జరగాల్సి ఉండగా ఉగ్రవాద ముద్రతో వేటాడటం పెరుగుతున్నది. నిఘాలో విఫలమైన కేంద్రం అందరికీ కనిపించే విలువైన పుస్తకాలపై విద్రోహ ముద్రవేసి విరుచుకుపడటంలో వింతేమీ లేదు. ఈ సర్కారు వచ్చాక తమిళనాడులో పెరుమాల్ మురుగన్‌పై దాడిచేసి రచయిత మరణించాడని ప్రకటన చేయించారు. గోవింద పన్సారీ, కల్బుర్గి, గౌరీలంకేశ్ వంటివారి ప్రాణాలే తీశారు. అప్పట్లో అది అవార్డువాపసీకి దారితీసింది. ఇదే క్రమంలో సినిమాలు, మీడియా పుస్తకాలు, కార్యకర్తలు, ఎన్‌జివోలపై వరసగా దాడులు చేస్తూనే వున్నారు. చరిత్రను తిరగరాసి మోడీనే మూలపురుషుడుగా హిందూత్వశకాన్ని చూపించా లనుకున్నవారికి నిజమైన చరిత్ర కారులు లేదా ప్రగతిశీల పరిశోధకులు ప్రమాదకరంగా గోచరిస్తారు.ఈ రచయితలు రాసినవాటితో తేడాలుంటే తామూ రాయొచ్చు. అదేంటో చెప్పొచ్చు. అంతేగానీ దశాబ్దాల తర్వాత అవి ఉండబో వంటూ నిషేధించడమేంటి? ఇది కాశ్మీర్‌లో విద్రోహశక్తుల కుట్రలు మరింత పెరగడానికే కారణమవుతుందని ఈ నిషిద్ధ గ్రంథాల రచయితలు చేస్తున్న హెచ్చరిక సరైందే. అణచివేతలు, మానవహక్కులు, సాయుధ దళాల ఉల్లంఘనల గురించిన అధ్యయనాలను నిషేదించడం అంతకన్నా మరేం సంకేతమిస్తుంది? ప్రజలెన్నుకున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిర్ణయం చేయడం వారి విశ్వాసానికి మరింత విఘాతం కలిగించదా?
బ్రిటిష్ పాలకులు గరిమెళ్ల సత్యనారాయణ పాటలనుంచి, ఉన్నవ మాలపల్లి నుంచి నిషేధించితే స్వాతంత్ర పోరాటం ఆగిపోలేదు. గోర్కి అమ్మ నిషేధిస్తే పావెల్ వంటివారు పుట్టకుండా పోలేదు.మతతత్వం, నిరంకుశత్వం మేళవించిన మోడీసర్కారు వాస్తవ చరిత్రనూ, హక్కులపై అణచివేతను కప్పిపుచ్చితే నిజం కనుమరుగై పోదు.మరింత బెడిసికొడుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇందుకు నిరాకరించవచ్చు.ఈలోగా తప్పుదిద్దుకుని పరువు కాపాడుకుంటుందేమో చూద్దాం, నిషేధాలను నిరసిస్తూ సర్వశక్తులా సమైక్యమై పోరాడుదాం.
25 నిషేధిత పుస్తకాలు
- హ్యూమన్ రైట్స్ వయొలేషన్స్ ఇన్ కాశ్మీర్ – పియోటర్ బాల్సెరోవిచ్ – అగ్నిస్కా కుస్జెవ్క్సా
- కాశ్మీరీస్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ – మహ్మద్ యూసుఫ్ సరాఫ్
- కొలొనైజింగ్ కాశ్మీర్ : స్టేట్ బిల్డింగ్ అండర్ ఇండియన్ ఆక్యుపేషన్ – హఫ్సా కంజ్వాల్
- కాశ్మీర్ పాలిటిక్స్ అండ్ ప్లెబిసైట్ – డాక్టర్ అబ్దుల్ గోఖామి జబ్బార్
- డు యు రిమెంబర్ కూనన్ పోష్పోరా?- ఎస్సార్ బటూల్ అండ్ అదర్స్
- ముజాహిద్ కి అజాన్ – ఇమామ్ హసన్ అల్-బనా షహీద్ (మౌలానా ఇనాయతుల్లా సుభానీ ఎడిటింగ్)
- అల్ జిహాదుల్ ఫిల్ ఇస్లాం – మౌలానా మౌదుది
- ఇండిపెండెంట్ కాశ్మీర్ – క్రిస్టోఫర్ స్నెడెన్
- రెసిస్టింగ్ ఆక్యుపేషన్ ఇన్ కాశ్మీర్ – హేలీ దుస్చిన్క్సీ, మోనా భట్, అథర్ జియా, సింథియా మహమూద్
- బిట్వీన్ డెమోక్రసీ అండ్ నేషన్ : జండర్ అండ్ మిలిటరైజేషన్ ఇన్ కాశ్మీర్ – సీమా కాజీ
- కంటెస్టెడ్ ల్యాండ్స్ – సుమంత్ర బోస్
- ఇన్ సెర్చ్ ఆఫ్ ఫ్యూచర్ : ది స్టోరీ ఆఫ్ కాశ్మీర్ – డేవిడ్ దేవదాస్
- కాశ్మీర్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ : ఇండియా, పాకిస్తాన్ అండ్ ది అన్ ఎండింగ్ వార్ – విక్టోరియా స్కోఫీల్డ్
- ది కాశ్మీర్ డిస్ప్యూట్ : 1947-2012 -ఎ.జి. నూరానీ
- కాశ్మీర్ ఎట్ ది క్రాస్‌రోడ్స్ : ఇన్‌సైడ్ ఎ ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాన్‌ఫ్లిక్ట్ – సుమంత్ర బోస్
- ఎ డిస్‌మాంటిల్డ్ స్ట్టేట్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీర్ ఆఫ్టర్ ఆర్టికల్ 370 – అనురాధ భాసిన్
- రెసిస్టింగ్ డిజప్పియరెన్స్: మిలిటరీ ఆక్యుపేషన్ అండ్ విమెన్స్ యాక్టివిజమ్ ఇన్ కాశ్మీర్ – అథర్ జియా
- కాన్‌ఫ్రంటింగ్ టెర్రరిజం – మారూఫ్ రజా (ఎడిటింగ్)
- ఫ్రీడమ్ ఇన్ కాప్టివిటీ : నిగోషియేషన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఎలాంగ్ ది కాశ్మీరీ ఫ్రాంటైర్ – రాధిక గుప్తా
- కాశ్మీర్: ది కేస్ ఫర్ ఫ్రీడమ్ – తారిక్ అలీ, హిలాల్ భట్, అంగనా ఛటర్జీ, పంకజ్ మిశ్రా, అరుంధతీ రారు
- ఆజాది – అరుంధతీ రారు
- యు.ఎస్.ఎ అండ్ కాశ్మీర్ – డా. షంషాద్ షాన్
- లా అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ కాశ్మీర్ – పియోటర్ బాల్సెరోవిచ్ అండ్ అగ్నిస్కా కుస్జెవ్క్సా
- తారిఖ్-ఇ-సియాసత్ కాశ్మీర్ – డా|| అఫాక్
- కాశ్మీర్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ సౌత్ ఏషియా – సుగత బోస్ అండ్ ఆయేషా జలాల్ (ఎడిటింగ్)
– తెలకపల్లి రవి