Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబసవతారకనగర్‌ గుడిసె వాసులపై మళ్లీ దాడి

బసవతారకనగర్‌ గుడిసె వాసులపై మళ్లీ దాడి

- Advertisement -

– పలువురికి గాయాలు
– రెండ్రోజులుగా ప్రయివేట్‌ వ్యక్తుల దౌర్జన్యం
– ఖాళీ చేయాలని హుకుం
నవతెలంగాణ-మియాపూర్‌

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్‌ గౌలిదొడ్డి విలేజీ పరిధిలోని బసవతారక నగర్‌లో కొద్ది రోజులుగా గుడిసెవాసులపై ప్రయివేట్‌ వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి, గుర్తుతెలియని వ్యక్తులు వందల సంఖ్యలో ఒకేసారి గుడిసెవాసులపై దాడికి పాల్పడ్డారు. రాడ్లు, కర్రలతో పేదలపై మూక్ముడిగా దాడి చేశారు. ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ దాడిలో ముత్తు అనే వ్యక్తికి గాయాలు కాగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరికొందరు మహిళలూ గాయపడ్డారు. అయితే తిరిగబడిన స్థానికులు.. కొంతమంది గుండాలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుడిసెవాసులు తెలిపిన వివరాల ప్రకారం..బసవతారకనగర్‌లో సుమారు 40 ఏండ్ల నుంచి పేదలు నివాసం ఉంటున్నారు. పది రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు అక్కడున్న కుటుంబాలను భయపెట్టి ఖాళీ చేయించారు.

మరి కొన్ని కుటుంబాలు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పాయి. దాంతో ప్రయివేట్‌ వ్యక్తులు వీరిపై దాడి చేసి, గుడిసెలను ధ్వంసం చేశారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశమైంది. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం బసవతారకనగర్‌లో పర్యటించారు. బాధితులకు మద్దతు తెలిపి అండగా ఉంటామని భరోసానిచ్చారు. సీపీఐ(ఎం), ఇతర ప్రజాసంఘాల మద్దతును జీర్ణించుకోలేని ప్రయివేట్‌ వ్యక్తులు మళ్లీ పేదలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రయివేటు వ్యక్తులపై చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనపై సీపీఐ(ఎం) నాయకులు శోభన్‌, కృష్ణ స్పందిస్తూ.. గచ్చిబౌలి డివిజన్‌ గౌలిదొడ్డి విలేజ్‌ బసవతారకనగర్‌ ప్రజలపై కొంతమంది వ్యక్తులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడులకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలపై ప్రయివేట్‌ వ్యక్తులు ఇలా దాడి చేయడం ఏమాత్రం సమంజనం కాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -