నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు క్రికెట్ ఆటగాళ్లపై ఇంటర్నేషనల్ కౌన్సిల్ (ICC)కు భారత్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ టోర్నీ సందర్భంగా సూపర్-4 మ్యాచులో పాక్ ప్లేయర్స్ హారిస్ రవూఫ్, ఫర్హాన్ వ్యవహరించిన తీరుపట్ల ఐసీసీ దృష్టి తీసుకెళ్లింది. మరోసారి ఇటువంటి పిచ్చిచేష్టలు పునరావృత్తం కాకుండా, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
భారత్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ‘గన్’షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చేష్టలకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. ఇక హారిస్ రవూఫ్ అయితే ఏకంగా ‘జెట్ ఫ్లైట్’లు కూలినట్లు 6-0 అని సైగలు చూపించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్ విమానాలను తమ సైన్యం కూల్చేసిందని పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దానిని గుర్తు చేసేలా హారిస్ ‘చేష్టలు’ ఉన్నాయనేది ప్రధాన విమర్శ. అంతేకాకుండా అభిషేక్ శర్మ, సుభామన్ గిల్‌లతో కూడా వాగ్వాదం చేశాడు.
మరోవైపు ఇండియా క్రికెట్ కెప్టన్ సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.గ్రూప్ స్టేజ్‌లో పాక్‌పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులు, భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. ఇప్పుడు అదే పాక్ కడుపు మంటకు కారణమైంది. సూర్య వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉన్నాయంటూ ఐసీసీ దృష్టికి పీసీబీ తీసుకెళ్లింది.