Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీసీల్లో భరోసా కల్పించే నాయకత్వం కావాలి

బీసీల్లో భరోసా కల్పించే నాయకత్వం కావాలి

- Advertisement -

యువత పుస్తకాలు చదివి
గత చరిత్ర తెలుసుకోవాలి
పుస్తకావిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ -సుల్తాన్‌బజార్‌

తెలంగాణ సమాజానికి ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకం స్ఫూర్తిదాయకమని, బీసీల్లో భరోసా కల్పించే నాయకత్వం కావాలని పుస్తకావిష్కరణ సభలో వక్తలు అన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐఏఎస్‌ నరహరి, హైకోర్టు అడ్వకేట్‌ పృథ్వీరాజ్‌ సింగ్‌ సంయుక్తంగా రచించిన ఓబీసీల పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్సీ.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రవణ్‌ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. సమాజహితం కోరుతూ ఐఏఎస్‌ అధికారి నరహరి పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. బీసీల్లో చైతన్యం, సామాజిక స్పృహ వచ్చింది కానీ తాను ఉన్నానంటూ భరోసా కల్పించే నాయకత్వం రావాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకొని జోడో యాత్ర చేపట్టారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో సర్వే శాస్త్రీయబద్దంగా జరిగిందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ, శాసనమండలిలో రెండు బిల్లులను ఆమోదించామన్నారు. ఈ బిల్లులను కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలిపారు. బీసీలంతా కులాలు పక్కనపెట్టి, హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యువత పుస్తకాలు చదివి గత చరిత్ర తెలుసుకోవాలని, అప్పుడే భవిష్యత్‌కు ముందడుగు వేసుకోవచ్చని చెప్పారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బీసీలను అణగదొక్కుతున్న పరిస్థితి ఉందని, చట్ట సభల్లో ప్రాతినిథ్యం కోసం పోరాటం చేయాలని అన్నారు. ఐఏఎస్‌ అధికారి నరహరి మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల మంది ఓబీసీల ఆశయాలు, ఆశలు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకాన్ని రాశానని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు, బడ్జెట్‌లో నిధులు, సంక్షేమ పథకాలు ఎవరికి, ఏ వర్గానికి ఎంత అందుతున్నాయో తెలియాలంటే కులగణనతోనే సాధ్యమన్నారు. జనాభా ప్రకారం ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తే, అధికారంతోపాటు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్‌ జె.పూర్ణచంద్రరావు, టీఎస్‌ఎండీసీ చైర్మెన్‌ ఈరవత్రి అనిల్‌ కుమార్‌, తెలంగాణ వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ వి.ప్రకాష్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad