పట్టపగలు ఒంటరిగా ఉన్న స్త్రీ హత్యకు గురి అయ్యింది. వివిధ టీవీ ప్రసారాలు, వార్తా పత్రికలు ఘోరమైన నేరం జరిగింది అని చెప్పి సమాజం దష్టి ఆకట్టుకున్నాయి. మహిళా సంస్థలు కొవ్వొత్తి ర్యాలీ నివాళి అర్పించారు. చట్ట సభ బల్లలు చేతి దెబ్బలు సహించాయి. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా తగిన భద్రత తీసుకుంటామని అధికార పార్టీ, ప్రతిపక్షాలు హామీలు చేశాయి. యువత ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారు? కమిటీ ఏర్పడింది!
”అమ్మా! మేడం గారు, వీడు నా మొదటి భార్య కొడుకు కపిలేశ్వర్. ఆమె చనిపోతే మంగళను పెళ్లి చేసుకున్నాను. మంగళ ఒద్దిక మనిషి, మంచిది. అయినా ఎందుకో, ఏమో వీడికి, దానికి పడటం లేదు. ఎక్కడ తప్పుందో అర్థం కావడం లేదు. వాడు స్కూల్ నుంచి రాగానే మీ ఇంట్లో కాసేపు ఆడుకుంటాడు. ఇంటికి రాగానే నేను తీసుకుని పోతాను” ఎదురింటి రైస్ మిల్ ఓనర్ కనకరాజు ప్రాధేయపడ్డాడు.
ముద్దుగా బొద్దుగా ఉన్న కపిల్ ఇంచుమించుగా తన పిల్లల వయసు వాడు. కొన్ని గంటల వ్యవధి కోసం మరో పిల్లాడిని చూసుకోవడం ఇబ్బంది కాదని అంగీకారం తెలిపింది. కొడుకు ఉత్తమ్, కూతురు ఉన్నతి, కపిల్ ముగ్గురు జత కుదుర్చుకున్నారు.
సవ్యమైన ఇల్లు, పెద్ద మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్‌ను మిగిల్చి, పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేయాలనే భర్త దఢమైన సంకల్పం మేరకు అమర కషి చేయసాగింది.
కొత్తలో మొహమాట పడే కపిల్ మాతప్రేమకు లొంగి పోయాడు. ‘ఇతరుల అబ్బాయి’ అనే తలంపు ఎప్పుడూ, ఎక్కడా పొడసూపలేదు. అమరను ‘ఆంటీ’ బదులుగా ‘అమ్మో’ అని కపిల్ పిలవడం అలవాటు చేసుకున్నాడు.
అమ్మను అలా భయపడేటట్టు పిలిస్తే నచ్చక, ఉత్తమ్ కొట్టిన దెబ్బకు కపిల్ చిన్నబోయి అన్నాడు ”ఆంటీ మా సెకండ్ అమ్మ పేరు, అందుకే నేను ఆంటీ అని ఎవ్వరినీ పిలవను, నాకిష్టం లేదు” చిన్నారి కపిల్ కళ్ళ వెంట కన్నీరు లేత బుగ్గల మీదుగా జారుతుంటే అమర కరిగి పోయింది.
”పేరులో ఏముంది? ప్రేమగా అలా పిలుస్తున్నాడు తప్పు లేదు, ఇక ఈ విషయాన్ని పట్టించుకోవద్దు” కొడుకును మందలించింది.
వేసవి సెలవులు వచ్చాయి, పగటి గంటల వ్యవధి కాస్త పెరిగి రోజంతా అమర ఆధీనంలో ఉండేవాడు. ఉత్తమ్, ఉన్నతి బాలభవన్ సమ్మర్ స్కూల్ క్యాంప్ వెళితే కపిల్ వెళ్లనని మొండి చేశాడు. అమర చేసే ప్రతి పనిలో ‘నేనంటూ’ ముందుండి మరీ చేరువయ్యాడు కపిల్.
కనకరాజు అనుమతించక పోయినా అనంతపురం ‘సత్యసాయి’ పాఠశాలలో ఉత్తమ్, కపిల్ చేత ప్రవేశ పరీక్ష రాయించింది. ఉత్తమ్ నెగ్గాడు, కపిల్ నెగ్గలేదు.
ఉన్నతి మనసులో మాట ఆపుకోలేక పోయింది ”అమ్మా! నన్నెందుకు ‘సత్యసాయి స్కూల్’ పరీక్ష రాయించలేదు?”
”మీ అన్నయ్య అదే స్కూల్లో చదవాలని నాన్నగారి కోరిక. నువ్వు హాస్టల్‌లో ఉంటూ చదవడం నాకు నచ్చదు. ఇక్కడ ఎన్నో మంచి స్కూల్స్ ఉన్నాయి.”
”నా గురించి నాన్నగారు తన కోరిక నీతో ఏమీ చెప్పలేదా?”
”నువ్వు డాక్టర్ చదవాలని చెప్పారు, శ్రద్దగా చదువుతావా ఉన్నీ?” ప్రేమగా అడిగింది.
”తప్పకుండా చదువుతాను. మరి నాన్నగారి వెండి పళ్లెంలో రోజు భోజనం చేయనిస్తావా?” చిన్న బంగారు పువ్వుతో అలరించిన వెండి కంచంలో భోజనం చేయాలని ఉన్నతి వాంఛ.
”నీ చదువుకు, నాన్న వెండి కంచానికి పొత్తు ఎందుకు?” చిరునవ్వుతో అంది.
”ఫొటోలో ఉన్న నాన్నగారి కంచం బీరువాలో ఎందుకు? ఇకమీదట నేను అందులో భోజనం చేస్తూ అన్ని విషయాలు నాన్నగారితో చెప్తాను” ఉన్నతి కోరిక నెరవేరింది.
కనకరాజు రైస్ మిల్ కుంటుపడ్డది. సవతి తల్లి రెడీమేడ్ డ్రెస్సులు కుట్టి వచ్చిన కొద్ది ఆదాయంతో చాలిచాలని ఇంటి జమా-ఖర్చులు చూసి దిమ్మ తిరిగిన కపిల్ ‘చదువు కంటే సంపాదన ముఖ్యమని’ నిర్ధారణ చేసుకున్నాడు.
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి విద్యార్థులను ఫెయిల్ చేయకూడదు. తొమ్మిదో తరగతి వరకు నెట్టుకొచ్చి పదో తరగతి పరీక్షల సూక్ష్మ వడబోత వలన ఉత్తీర్ణత బెడిసి కొట్టింది. ఓటమి అంగీకరించలేక చదువుకు స్వస్తి పలికాడు. విద్య దూరమయింది. ఉత్తమ్ ఇంజనీరింగ్ ఐఐటీ ఖరగ్పూర్, ఉన్నతి మెడిసిన్ హైదరాబాద్ చదువుల పరుగు అందుకున్నారు.
ఖర్చులకు డబ్బు కొదవ లేని ఇంట్లో స్వేచ్ఛను ఇచ్చే స్త్రీ! వేసవి సెలవుల్లో మాత్రమే కనపడే ఉత్తమ్! యవ్వన అందెల ఆకర్షిత ఉన్నతి!! ప్రలోభాల రంగులు ఉసిగొల్పాయి. కొసమెరుపు దిద్దాలని కపిల్ వయసు-మనసు ఉబలాట పడ్డది.
”ఉన్ని! మీ అమ్మకు నేను ప్రతి పనిలో సాయంగా ఉన్నాను. ఉత్తమ్ లేని లోటు తెలియనివ్వను కదా” కదిపాడు.
”నువ్వలా అలవాటు చేసుకున్నావు. మా అమ్మ సింగిల్ పేరెంట్, సెల్ఫ్ డిపెండెంట్. నియమ ప్రణాళికతో క్రమబద్ధంగా మమ్మల్ని పెంచిన రీతి.. గ్రేట్!” సత్యమైన విషయాన్ని సంతోషంగా చెప్పింది.
”అఫ్కోర్స్, పైకి కనబడదు కానీ మీ అమ్మ మన దేశ ఆర్థిక మినిస్టర్ అవ్వాలి?!”
”అమ్మను ఎగతాళి చేస్తున్నావా?” ఉరుము ఉరిమింది.
”గౌరవిస్తున్నాను, మీ అమ్మ బర్డెన్ తగ్గించాలని నీకు భర్తనై, ఆమెకు బాడీగార్డ్ గా ఉండాలనుకుంటున్నాను”
”నాన్సెన్స్! నువ్వు.. నీ బిల్డ్ అప్”
”ఇది బిల్డ్ అప్ కాదు, మీ ఇంట్లో నేను ఫ్యామిలీ మెంబర్‌గా బిల్డ్ అవ్వాలనుకుంటున్నా”
”ఆల్రెడీ మా అమ్మ నిన్ను మాతో సమంగా చూస్తుంటే, ఇంకేం కావాలి?”
”ఉన్ని! ఇన్ని రోజులు నేను మూగ ప్రేమికుడిని, ఈ రోజు మనసు విప్పి చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకొని శాశ్వతంగా నీకు, మీ ఇంటికి రక్షణ ఇవ్వాలని..” కపిల్ కళ్ళల్లో కాంతి వెలిగింది.
”కపిల్! ఏం మాట్లాడుతున్నావ్? మా రక్షణ కోసం.. పెళ్లి? దిస్ ఈజ్ రెడికులేస్! నీకూ, నాకు పెళ్లి జరగదు. అలాంటి ఆలోచన మానేసి బుద్ధిగా చదువు, ఉద్యోగం చేసుకో. ప్లీజ్, నీ బతుకేదో బతుకు”
కపిల్ కోరుకున్న ఫలితం దక్కలేదు. అమరని వారధిగా మలిచాడు.
”అమ్మా! నా ఆశయం, ఆదర్శం వేరు. ఇప్పట్లో నా పెళ్లి మాట ఎత్తకు. ఒకవేళ ఎత్తినా కపిల్ మాత్రం వద్దు.”
”ఎందుకు ఉన్ని? నా చేతుల మీదుగా మన ఇంట్లో పెరిగాడు, మంచి వాడు, ఈడుజోడు చక్కగా ఉంది. నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని మాటిస్తున్నాడు. చదువు మాత్రం అబ్బలేదు, చదువు కంటే గుణం ముఖ్యం. పైగా మనందరం చదువుకున్నాం. ఏమిటి నీ అభ్యంతరం?”
”కారణాలు చెబితే నీ పెంచిన ప్రేమ తట్టుకోలేదు” సంశయంగా అన్నది.
”కారణాలు కాదు, ఒక్క కారణం చెప్పు” అనునయంగా అంది. పరోక్షంగా కపిల్ తన సంభాషణలు వింటున్నాడని ఉన్నతి గ్రహించింది.
”మనింట్లో నాతో సమానంగా పెరిగిన వాడు నాకు అన్న అవుతాడు, భర్త కాడు” చాటుగా వింటున్న కపిల్‌కు వినపడేట్టు స్వరం పెంచింది.
కపిల్ తన ఉనికి తెలుసుకున్నారని జారుకున్నాడు.
తల్లికి మరీ చేరువగా కూర్చొని చెవిలో చెప్పింది ”అమ్మా! కపిల్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిన్ను నమ్మించే మాటలతో అబద్ధాలు చెబుతున్నాడు. నువ్విచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు” అమ్మ చేతిని మనసున హత్తుకుంది.
మళ్లీ అంది ”రెండు సార్లు నాతో మిస్ బిహేవ్ చేశాడు. అఫ్కోర్స్, నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు బాధ పడతావని ఇన్నాళ్ళూ నీకు చెప్పలేదు” అమ్మ ఒడిలో తల పెట్టుకుంది.
పెంచిన ప్రేమ ఫలితమా? గుండెలో గుదిబండ బరువు, మమతకు మలినం అంటుకుంది. సెలవులకు ఇంటికి వచ్చిన ఉత్తమ్‌ను పట్టుకుని ఏడిస్తే మనసు స్థిమిత పడ్డది.
”మా వారికి శ్వాస ఇబ్బందిగా ఉంది, ఒక్కసారి వచ్చి చూడండి” మంగళ దీనంగా అంది. ఉన్నతి కనకరాజును పరీక్ష చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముందు డబ్బులు కట్టిన తర్వాత ఆస్పత్రిలో వైద్య పరీక్షలు. ఉన్నపళంగా అంత పెద్ద మొత్తం డబ్బు ఎక్కడ ఉన్నాయి, ఎవరిస్తారు?
”నేనిస్తాను, మీ సానుకూలతను బట్టి ఇవ్వండి” అమర గూగుల్ పేమెంట్ చేసింది. స్టెంట్ వేశారు. పేషెంట్ ఐసియులో. పేషెంట్ తాలూకు వారు బయట కూర్చున్నారు.
”ఆంటీ! కపిల్ కనబడలేదు, ఎక్కడ ఉన్నాడు?” మంగళ జవాబివ్వలేదు.
”మీరు ఒక్కరు ఇక్కడ.. కపిల్ ఉంటే బాగుంటుంది” ఉన్నతి నసిగింది.
”కపిల్ రాడు, ఈ మధ్య డబ్బు కావాలని పట్టుపట్టాడు, ఇవ్వలేదని మమ్మల్ని నానా బూతులు తిట్టి గొడవ పెట్టుకున్నాడు”
”మంగళ గారు! కపిల్ ప్రాబ్లం ఏమిటో?” అమర చూచాయగా అడిగింది.
”ఎంత బాగా చూసినా నేను సవతి తల్లి అనే తలంపు వలన కపిల్ మనసులో మచ్చ తొలగించలేక పోతున్నాను. నా కుట్టుపని ఆదాయంలో ఒక్క రూపాయి కూడా దాచింది లేదు” స్వరం దుఃఖంతో పూడుకుంది. అమర మనసు కలత చెంది ధ్యాస మళ్లించే ప్రయత్నం చేసింది. ఉన్నతి డాక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంది
”ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు, స్పహ వస్తే నాకు ఫోన్ చేస్తారు, వెళ్దాం పదండి.”
ట్రాఫిక్ వలన ఉన్నతి మెల్లిగా కార్ డ్రైవ్ చేస్తుంది.
”మీ ఇంట్లో అన్నీ పద్దతిగా క్రమశిక్షణ కలిగి ఉంటారని, కపిల్ మీ ఇంట్లో పెరగాలని మా ఆయన ఆశ. కానీ కపిల్ విరుద్ధ మనస్తత్వం అర్థం కాదు. మా వారికి ప్రతి దినం రాత్రి డ్రింక్ అలవాటు. డాడీ డ్రింక్ తీసుకుంటే తానేందుకు తాగొద్దుని గొడవ. అటు చదువు లేదు, ఇటు సంస్కారం లేదు. డ్రింక్స్ మత్తు సరిపోలేదని డ్రగ్స్ అలవాటయ్యాయి. నా పిల్లలు ఎక్కడ పాడై పోతారో అనే భయంతో విసుక్కుంటే.. కపిల్ ప్రవర్తన కారణమో, మారిన నా చిరాకు కారణమో తెలియదు, మా వారికి ఆరోగ్యం కుంటుపడ్డది.”
”మంగళ! ఏడవకండి” ఓదార్పు మరింత బాధకు వెల్లువ అయింది.
”మీరంటే ఎంతో గౌరవం, ఏదో ఒక మార్గం ఆలోచించి కపిల్‌ను సన్మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండమ్మా!” ఇంటికి తిరిగి వచ్చిన కనకరాజు అర్థించాడు.
‘పునర్వవస్థీకరణ’ ఒక్కటే మార్గం! పిల్లలిద్దరినీ సంప్రదించింది. వాళ్లు ఒప్పుకోలేదు. ‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు, తవిలి మగతష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు’ కానీ, మంచి కోసం ప్రయత్నిస్తే తప్పు లేదు, ముందడుగు వేసింది.
ఉత్తమ్, ఉన్నతి ఉద్యోగరీత్యా వేరే పట్టణాల్లో ఉంటున్నారు. అమర తన ఆధ్వర్యంలో కపిల్ మార్పు కోసం ఒక ప్రణాళిక ఆలోచించింది. ఒక తల్లిగా, ఉపాధ్యాయునిగా ఆరోగ్యమైన అలవాట్లతో కపిల్ నడవడిక పట్ల భోదనలు చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటై నచ్చిన అమర ఇల్లు ఇప్పుడు అండమాన్ నికోబార్ కారాగారం తలపిస్తున్నది.
”నాకు బీరు తాగాలని ఉంది, కనీసం గుట్కా అయినా కావాలి” బతిమాలాడు. అమర వినిపించుకోలేదు. బ్యాడ్మింటన్ కోచింగ్ మొదలుపెట్టింది.
”మీ పిచ్చి గాని ఎక్కడ ఉత్సవాలు, ఫంక్షన్లు జరిగినా బీరు విస్కీ సీసాలు, ప్లాస్టిక్ గ్లాస్లు, పేపర్ ప్లేట్స్ ఇంకా వీధి కుక్కలు పీక్కు తింటున్న కూర బొక్కలు! నేను వీటికి దూరంగా ఉండి ఎవరిని ఉద్ధరించాలి? నా ఎంజాయ్మెంట్ ఎందుకు దూరం చేసుకోవాలి?” నిలదీశాడు.
”మీ ముగ్గురూ నా సమక్షంలో పెరిగారు, వారిద్దరూ ప్రయోజకులయ్యారు. నిన్ను కూడా గెలిపిస్తాను. కొద్దిగా ఆలస్యం అంతే!” ఎంతో నమ్మకంతో ధైర్యంగా చెప్పింది.
”ప్రయోజకత్వం అంటే? సగటు జీవితానికి ఏదో దారిన డబ్బు సంపాదన, జల్సా బతుకు. అంతే కదా!” సవాల్ చేశాడు.
”కాదు. నీలోని బలహీనతలను అధిగమించాలి. మనసు ప్రశాంత మయం కావాలి.” నవ్వుకున్నాడు కపిల్.
”కపిల్! సమాజంలో జరిగే తప్పులకు మనుషుల్లో బలుపు, బలహీనత, బరితెగింపు, పైశాచికత్వం కారణాలు” హితబోధను అడ్డుకున్నాడు.
”ఇంకోటి మర్చిపోయారు, కోరిక. మీరు గీసిన లక్ష్మణరేఖ పరిధిలో అందర్నీ బలి చేసే మీ కోరికల అహం!” కళ్ళు పెద్దవి చేసి ”మీ పిల్లల్ని మీకు అనుగుణంగా బందీలను చేశారు. కానీ ఏం లాభం?? మీ అవసరానికి మీ పిల్లలు మీకు తోడుగా లేరు. నేను మీకు చాకిరీ చేయాల్సి వచ్చింది, అవునా!?” ప్రశాంతంగా అన్నాడు.
”మనం పరస్పరం తీసుకునే శ్రద్ధ, బాధ్యతలు చాకిరీలు కావు కన్నయ్యా..” శాంతంగా చెప్పింది.
”అవునా? ఇది ఫోన్ ఛార్జింగ్ వైర్, పని చేయడం లేదని పక్కన పెట్టారు. ఎందుకు?”
”ఈ పిచ్చి ప్రశ్నలు మాని, పద మనం చెస్ ఆడదాం, లేదంటే వర్డ్ పజిల్” పక్కనే ఉన్న టేబుల్ డ్రా తెరిచింది.
కపిల్ వెనుక నుండి అమాంతం అమర మెడను ఛార్జింగ్ వైర్ తో బిగించాడు. క్రిందికి జారుకోవాలని అల్లాడింది. కాళ్ళ మధ్యలో గట్టిగా ఇరికించి వైర్ను శక్తికొద్దీ లాగి బందీని చేశాడు. అమర శ్వాస ఆగిపోయింది.
అమర పర్స్ తెరిచాడు, భద్రంగా దాక్కున్న వంద నోటు, తాళంచెవి తీసి హడావిడిగా బీరువా తెరిచాడు. ఇంటి కాగితాలు, సర్టిఫికెట్లు, ఆరోగ్య పరీక్ష కాగితాలు, బట్టలు, వెయ్యి రూపాయలు. ఇంతే! వెండి బంగారాలు లేవు, నోట్ల కట్టలు అసలే లేవు.
‘బ్యాంకుల్లో దాచుకున్నవా తల్లీ? అంతమాత్రానికే బీరువా తాళం వేసి నన్ను ఊరించటం ఎందుకో?’ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డుల విన్యాసం చేశాడు. ఒక్క రూపాయి కూడా తన అకౌంట్లో జమ కాలేదు.
ఉక్రోషంతో అమర గొలుసు, ఉంగరం లాక్కున్నాడు. కాఫీ కలుపుకుని తాగి సోఫాలో కూలబడ్డాడు.
‘అమ్మో ప్రాణం తీసి ఏం సాధించాను? ఈ మాత్రం వెయ్యిన్నూరు కావాలని అడిగితే ఇచ్చేది. తొందరపడ్డానా?? లేదు. ఈమెకు పొగరు! తగిన శాస్తి జరిగింది’ దర్జాగా బయటకు నడిచాడు.
ఉత్తమ్, ఉన్నతి యుద్దప్రాతిపదికన హత్య కేసు ముందుకు తీసుకెళ్లారు. కనకరాజు కుటుంబ సమేతంగా ఇల్లు వదిలి ఎక్కడికి పోయారో తెలియలేదు.
‘ఎన్ కౌంటర్‌లో కపిలేశ్వర్ చనిపోయాడు’ వార్త వ్యాప్తి చెంది అందరినీ కలవర పరచినది. ఎందుకు హత్య చేశాడు అని మాత్రం ఎవ్వరూ సరిగ్గా విశ్లేషించ లేక పోయారు. యువత చెడు అలవాట్లు పెరుగుతున్నా క్రమశిక్షణ మార్గాలు అరుదు!
వివిధ రంగుల జెండాలు చేతబూని జరిగిన అందోళనలు, సమ్మెలు కాలక్రమేణా కాంతి ప్రకీర్ణ చెంది తెలుపు రంగును ఆక్రమించుకున్నాయి! అంతా ‘శాంతిమయం’ అంది సమాజం.
- సురేఖ పులి, 7702265542