Sunday, May 11, 2025
Homeప్రధాన వార్తలుఅందంగా, ఆహ్లాదంగా మిస్‌వరల్డ్‌ పోటీలు

అందంగా, ఆహ్లాదంగా మిస్‌వరల్డ్‌ పోటీలు

- Advertisement -

– ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
– ర్యాంపుపై అలరించిన పోటీదారులు
– కట్టిపడేసిన సంస్కృతి, సంప్రదాయ నృత్య వేడుకలు
-సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

డార్విన్‌ జీవ పరిణామక్రమాన్ని అనుసరిస్తూ అంతర్జాతీయ మహిళా అందాల పోటీలు గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఆహూతులు, వివిధ దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్‌లు ఆ గీతం అయిపోయేవరకు గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కండ్లు చెదిరే విద్యుత్‌కాంతులు, లయబద్ధమైన సంగీతం మధ్య తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ వేదికపై కళారూపాలను ప్రదర్శించారు. ఒగ్గుడోలు, లంబాడా, గుస్సాడి, కొమ్ము కోయ కళాకారులతో పాటు 250 మంది పేరిణి నృత్య కళాకారుల అభినయాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల మహిళా ప్రతినిధులు తమ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ ర్యాంప్‌పైకి వచ్చారు. కరేబియన్‌ లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండం నుంచి అంగోలా, యూరప్‌ ఖండం నుంచి అల్బేనియా దేశాలకు చెందిన పోటీదారులు తొలి మూడు వరుసల్లో ర్యాంప్‌పైకి వచ్చారు. అనంతరం ఇతర దేశాల పోటీదారులు ర్యాంప్‌పై తమదేశాలకు చెందిన ఆహార్యాలు, సంప్రదాయాలను గుర్తుచేస్తూ, ప్రదర్శనలు ఇచ్చారు. ప్రారంభవేడుకలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. సభికులకు ఆభివందనం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ స్వాగతోపన్యాసం చేశారు. ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిష్టినా ఆతిధ్య రాష్ట్రం తెలంగాణకు అభినందనలు తెలిపారు. అంతకుముందు సరిహద్దుల్లో దేశంకోసం పోరాడుతున్న సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ శాంతి, ఐక్యతకు ఈ పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ విజయలక్ష్మి, మిస్‌ వరల్డ్‌ సీఈఓ జాలియా మోర్లే, మిస్‌ వరల్డ్‌ క్రిష్టినా, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మెన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కుటుంబసభ్యులతో ఈ వేడుకను వీక్షించేందుకు వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ర్యాంపు పైకి చివరగా మిస్‌ ఇండియా నందిని గుప్తా వచ్చారు ఆమెను చూడగానే సభికులు హర్షధ్వానాలు పలికారు. మిస్‌ నేపాలీ కాంటెస్టెంట్‌ చీరకట్టుతో ర్యాంప్‌పైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 110 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు తమ దేశాల జాతీయ పతాకాలతో ఒకేసారి వేదికపైకి వచ్చారు. మిస్‌ ఇండియా నందిని గుప్తా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, చివరిగా వేదికపైకి వచ్చారు. అత్యంత వైభవోపేతంగా, ఆహ్లాద వాతావరణంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి వేర్వేరు వేదికలపై కంటెస్టెంట్లు పోటీల్లో పాల్గొంటారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్న స్టేడియం వద్ద పోలీసులు మూడంచల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌ను దారిమళ్ళించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -