Sunday, May 11, 2025
Homeరాష్ట్రీయంసౌందర్య సరుకుల మార్కెట్‌ కోసమే అందాల పోటీలు

సౌందర్య సరుకుల మార్కెట్‌ కోసమే అందాల పోటీలు

- Advertisement -

– వాటి గురించి తెలియకపోతే హేళన చేసే పరిస్థితులొచ్చాయి
– మహిళల్లో ఆత్మనూన్యతా భావాన్ని పెంచడమే
– స్త్రీల వ్యక్తిత్వాన్ని గౌరవించరా?
– ఈ పోటీల ద్వారానే తెలంగాణ సంస్కృతి వెల్లివిరుస్తుందా?
– కాయకష్టం చేసుకునే మహిళలకు ఏం సందేశమిస్తున్నారు
– ఆరోగ్య, మానసిక ప్రశాంతతోనే అందం : ఎస్‌వీకే వెబినార్‌లో ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ అందాల పోటీలు సౌందర్య సరుకులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీల మార్కెట్‌ కోసమేనని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి ఎస్‌. పుణ్యవతి విమర్శించారు. వాటి గురించి తెలియక మహిళలను హేళన చేసే పరిస్థితులు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అందాల పోటీలపై ఆసక్తి పెంచి, తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. 2012-13లో రూ. 41 కోట్ల ఉత్పత్తులు అమ్ముడుపోగా, 2017లో రూ.80 కోట్ల ఆదాయాన్ని పెంచుకున్నాయని గుర్తు చేశారు. 2026లో ఆదాయాన్ని మరో 40శాతాన్ని పెంచుకునే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయన్నారు. మహిళల్లో ఆత్మనూన్యతా భావాన్ని పెంచి ఆయా కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకే ఆధ్వర్యంలో అందాల పోటీలు అవసరమా? అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో పుణ్యవతి మాట్లాడారు. ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందాల పోటీల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు ప్రాణాలకు తెగించి కొట్లాడారని గుర్తు చేశారు. వీరనారి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తదితర వీరవనితలెందరో త్యాగాలు చేశారని తెలిపారు. ఆ చరిత్రను మరచిపోయారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాటి పాలకులు స్త్రీలను అనేక రకాలుగా అవమానించారనీ, హింసకు గురి చేశారని తెలిపారు. ఆ చరిత్రను వెలికి తీయొచ్చు కదా? అని అభిప్రాయపడ్డారు. చేనేతకు మార్కెట్‌ బాగా ఉందన్నారు. చేనేతకు నూలు, రంగులు, పరికరాలు, సబ్సిడీలు, వారికి గూడు వంటి సౌకర్యాలు కల్పిస్తే చేనేత రంగం వెల్లివిరుస్తుందని వివరించారు. చేనేతకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనీ, దాన్ని ప్రోత్సహించాలని కోరారు. డ్వాక్రా మహిళలకు అభయహస్తం డబ్బులు విడుదల చేస్తే, వారే చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తారని సూచించారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజుల పని, రూ.600 కూలి ఇవ్వడం ద్వారా వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు. తద్వారా చేనేత రంగం అభివృద్ధి అవుతుందే తప్ప అందాల పోటీల వల్ల కాదని స్పష్టం చేశారు. ఈ పోటీలతో స్త్రీల వ్యక్త్తిత్వాన్ని కించపరచడమేనన్నారు. తెలంగాణలో పరువు హత్యల పేరిట జంటలను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సంస్కృతి నుంచి ఏ సంస్కృతికి దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు అందాల పోటీలు ఉపయోగపడుతాయని చెప్పడం అవివేకమన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో అధికార యంత్రాంగం క్యాన్సర్‌పై ప్రచా రాన్ని చేయొచ్చు కదా? అని సూచించారు. అందాల పోటీల్లో విజయం సాధించిన స్త్రీలు ఆయా కంపెనీల ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మారుతారు తప్ప మరో ఉపయోగం లేదన్నారు. సుస్మితా సేన్‌, ఐశ్వర్యరారు సినిమా రంగంలో ఉన్నారని గుర్తు చేశారు. అందం అంటే కొలతలు కాదన్నారు. వ్యవసాయ రంగంలో 80 శాతం మంది మహిళలే పని చేస్తున్నారని, కాయకష్టం చేసే మహిళలను గౌరవించరా? అని వ్యాఖ్యానించారు. అందాల పోటీల ద్వారా సౌందర్య సాధనాల అమ్మకాలే కాదనీ, నగలు, దుస్తులు, హెయిర్‌స్టైల్‌ డిజైన్లకూ మార్కెట్‌ పెంచుతున్నారని చెప్పారు. అందం, అలంకరణ, సౌందర్యం పట్ల క్రేజీ పెంచడం, మార్కెట్‌ పెంచుకోవడం ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం అనేది అంతర్గత రహస్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల్లో పేద, ధనిక అన్న తేడా లేకుండా మహిళల్లో బీపీ, షుగర్లు పెరుగుతు న్నాయనీ, వాటికి మందులు, పరికరాలు చౌకగా అందించాల్సిన అవసరం లేదా? అని అభిప్రాయ పడ్డారు. మహిళల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా సంఘాల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అందాల పోటీలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -