– ప్రజలకు ఆత్మ స్థైర్యాన్ని కల్పించేలా వైద్య సేవలు
– త్వరలో మరిన్ని ఖాళీల భర్తీ : వైద్యఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ
– వికారాబాద్ జిల్లా పరిగిలో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
– వికారాబాద్‌లో 300 పడకల ఆస్పత్రి ప్రారంభం
నవతెలంగాణ-పరిగి, వికారాబాద్
ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. సోమవారం వికారాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించారు. పరిగి పట్టణ కేంద్రంలో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రి పనులకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాతతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రుల, వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్, వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి తెస్తామన్నారు. డయాలసిస్ సెంటర్‌లో బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ పేషెంట్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడేలా అత్యాధునిక వసతులతో ట్రామా కేర్ సెంటర్లు అభివృద్ధి చేస్తామన్నారు. అంబులెన్స్‌ల సంఖ్యను పెంచి, అత్యవసర సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇటీవలే 213 కొత్త అంబులెన్స్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గతేడాది 16 కొత్త నర్సింగ్ కాలేజీలను ప్రారంభిం చుకున్నామన్నారు. గతేడాది 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, మరో 2,300 పైచిలుకు పోస్టుల భర్తీ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల రూపు రేఖలను మార్చడానికి బ్రాండింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమం ద్వారా మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఆస్పత్రులను అభివృద్ధి చేసి, పేషెంట్లకు మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని అన్నారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ, సూపరిం టెండెంట్‌లు జవాబుదారీతనంతో ఉండాలన్నారు.
జిల్లాలోని ప్రభుత్వేతర ఆస్పత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కుల గణన సర్వే నిర్వహించి 75 అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించినట్టు తెలిపారు. కులాలకతీతంగా సామాజిక న్యాయం జరగాలనే నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ అజరు కుమార్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, డీసీహెచ్‌ఓ ఆనంద్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES