నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని, ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు.
ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్‌కు వరస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆయన పార్టీ జన్ సురాజ్ తరుపున పోటీలో ఉన్న వారు క్రమంగా పోటీ నుంచి తప్పుకుంటున్నారు. అక్టోబర్ ప్రారంభంలో ముగ్గురు జన్ సురాజ్ అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహకరించుకున్నారు. వీరు ముగ్గురు దానాపూర్, బ్రహ్మపూర్, గోపాల్ గంజ్ నియోజకవర్గాల నుంచి పోటీ నుంచి బయటకు వచ్చారు. తమ అభ్యర్థుల్ని అడ్డుకునేందుకు బీజేపీ బల ప్రయోగం చేస్తోందని జన్ సురాజ్ ఆరోపిస్తోంది. గురువారం 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ జరుగబోతోంది. 243 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్ లో రెండో దశ పోలింగ్ నవంబర్ 11న, ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.



