నవతెలంగాణ-హైదరాబాద్: సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు వెళ్లిన జుబీన్ గార్గ్..సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆయన మృతిపై అసోం ప్రభుత్వం దర్యాప్తు కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, కో-సింగర్ అమృత్‌ప్రవ, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామిని అరెస్ట్ చేశారు. ఇక జుబీన్ గార్గ్ ఈతకొడుతున్న దృశ్యాలు కో సింగర్ అమృత్‌ప్రవ తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. ఈ వీడియోలు దర్యాప్తునకు చాలా కీలకంగా మారాయి.
ఇక విచారణలో బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన విషయాలు బయటపెట్టాడు. జుబీన్ గార్గ్‌కు మేనేజర్ సిద్ధార్థ శర్మ విషమిచ్చి చంపినట్లు వెల్లడించాడు. హోటల్ దగ్గర నుంచి బోటింగ్ వరకు సిద్ధార్థ శర్మ ప్రవర్తన చాలా భిన్నంగా కనిపించిందని తెలిపాడు. బోటింగ్‌ను నావికుడి దగ్గర నుంచి సిద్ధార్థ శర్మ తన స్వాధీనంలోకి తీసుకున్నాడని.. ఆ సమయంలో సముద్రం మధ్యలో చాలా గందరగోళానికి గురైనట్లు చెప్పాడు. ఇక బోటులో స్వయంగా సిద్ధార్థ శర్మనే పానీయాలు అందించాడని.. తమను ఎలాంటి ఆహారం అందించొద్దని సూచించాడని తెలిపాడు. ఇక జుబీన్ గార్గ్ ఈతకు దిగకముందే విష ప్రయోగం జరిగిందని.. ఇక ఈతకు దిగిన తర్వాత ఎవరూ దగ్గరకు వెళ్లొద్దని సిద్ధార్థ శర్మ సూచించాడని.. అంతేకాకుండా బోటుకు సంబంధించిన వీడియోలు ఎవరికీ షేర్ చేయొద్దని చెప్పినట్లుగా పేర్కొన్నాడు. అమ్మాయిల సరఫరా కూడా సిద్ధార్థ శర్మనే చూసుకున్నాడని తెలిపాడు. కుట్ర బయటపడకుండేందుకు విదేశీ మద్యాన్ని ఏర్పాటు చేశాడని చెప్పుకొచ్చాడు.
ఇక జుబీన్ గార్గ్ ఈత కొడుతున్న సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ‘‘జబో దే, జబో దే’’ (అతన్ని వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి) అని పదే పదే సిద్ధార్థ శర్మ చెబుతున్న మాటలు వీడియోలో రికార్డైంది. అతడి హావభావాలు కూడా చాలా విచిత్రంగా కనిపించాయి. ఇదిలా ఉంటే జుబీన్ గార్గ్ ఒకసారి ఈతకెళ్లి తిరిగి బాగానే వచ్చాడని.. రెండోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు రాలేదు. మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ బృందం సింగపూర్ కూడా వెళ్లనుంది.