నవతెలంగాణ ఢిల్లీ:
కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో మాట్లాడిన ఆయన భారత్‌కు ప్రస్తుతం ఇదే పెద్ద ముప్పు అని అన్నారు. అయితే, భారత్‌కు ఉన్న సాంస్కృతిక వైవిధ్యత, సాంకేతిక సామర్థ్యం, వైద్య వ్యవస్థల కారణంగా దేశ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉందని అన్నారు.
ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడే దేశానికి అతి పెద్ద ముప్పు. భారత్ అంటే వివిధ సంస్కృతులు, మతాలు, భావాల సమాగమం. వీటి మధ్య చర్చకు చోటు ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్‌గా దాడి జరుగుతోంది. అది పెద్ద ముప్పు అని అన్నారు. 2016 నాటి నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. ‘వాళ్లు దేశంలో నగదుకు స్థానం లేకుండా చేయాలనుకున్నారు. విధానపరంగా చూస్తే నోట్ల రద్దు నిర్ణయం పెద్ద వైఫల్యం’ అని పేర్కొన్నారు.
ఇక అవినీతి నిర్మూలనకు అధికార వికేంద్రీకరణ తగిన పరిష్కారమని అన్నారు. అయితే, ప్రస్తుతం భారత్‌లో కేంద్ర స్థాయిలో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మూడు నాలుగు సంస్థల చేతుల్లో ఉందని అన్నారు. వీటికి ప్రధానితో నేరుగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు.