– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: బీసీ రిజర్వేషన్లపై అసలు దోషి బీజేపీయే అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి అన్నారు. బంద్ సందర్బంగా శనివారం అఖిల పక్షం, సామాజిక ప్రజా సంఘాలు నిర్వహించిన బంద్ లో పాల్గొని, సీపీఐ(ఎం) కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణను చేపట్టి బీసీలు 56% గా ఉన్నారని తేల్చిందని అన్నారు. 56% గా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడం సముచితమైనదని భావించి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని అన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి న్యాయస్థానాలపై మోపడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. నేడు తలపెట్టిన బందులో పాల్గొనే నైతిక అర్హత బీజేపీకి లేదన్నారు.బీసీ రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న బిజెపి, ఏ ఉద్దేశంతో బంద్ లో పాల్గొంటుందో తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు వేసిన ఓట్లతో గద్దెనెక్కిన ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.బీసీ రిజర్వేషన్ లపై నేడు తలపెట్టిన బంద్ పూర్తిగా బిజెపి కపట వైఖరికి, ధమన నీతికి, ద్వంద విధానాలకు వ్యతిరేకంగానే అనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలని అన్నారు. కాబట్టి తక్షణమే బీజేపీ రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్ లో చేర్చాలని, 42% నికి చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, కార్మికులు రంగన్న, వీరేష్,బాబాన్న, గజేంద్ర, నరసింహ, భాస్కర్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.