నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడు. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి హైడ్రాలిక్ క్రేన్‌ను ఉపయోగించి అందులో కూర్చొని ఎంపీ పూలమాల వేశారు.
అయితే ఈ సమయంలో క్రేన్‌లో కాస్త ఇబ్బందులు తలెత్తి ఒక్కసారిగా కుదిపేసింది. ఒక్క క్షణంలో షాక్ గురైన ఎంపీ.. కోపంతో అక్కడే ఉన్న మున్సిపల్ క్రేన్ ఆపరేటర్ చెంపపై కొట్టాడు. కెమెరాలో రికార్డ్ అయిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ అసలు స్వరూపం ఇదేనంటూ మండిపడుతున్నారు.

 
                                    