నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ విధానాలను లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్రంగా విమర్శించారు. బీజేపీ తెచ్చిన విధానాలు ముఖ్యంగా వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని చిన్న వ్యాపారాలను దెబ్బతీశాయని రాహుల్ ఆరోపిచారు. బీజేపీ భూస్వామ్య మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, వైశ్య సమాజానికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘నేను వ్యాపారులతో మాట్లాడినప్పుడు తమ వ్యాపారం పతనం అంచున ఉంది అని వ్యాపారస్తులు ఆవేదన చెందారు. వైశ్య సమాజం నుంచి వచ్చిన ఈ ఆవేదన నన్నెంతగానో కదలించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు చారిత్రాత్మకంగా ఎంతో దోహదపడిన సమాజం నేడు నిరాశలో ఉంది. ఇది ప్రమాద హెచ్చరిక. బీజేపీ ప్రభుత్వం గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛను ఇచ్చింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులను అధికార సంకెళ్లు, తప్పుడు జిఎస్‌టి వంటి లోపభూయిష్ట విధానాలతో బంధించారు’ అని రాహుల్ ఎక్స్ పోస్టులో తీవ్రస్థాయిలో విమర్శించారు.
బీజేపీ తెచ్చిన జిఎస్‌టి సవరణలు కేవలం విధాన వైఫల్యం కాదు. ఇది ఉత్పత్తి, ఉపాధి భారతదేశ భవిష్యత్తుపై ప్రత్యక్ష దాడి. ఇది బీజేపీ ఫ్యూడల్ మైండ్‌సెట్ తెలియజేస్తోంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ యుద్ధంలో దేశ వాణిజ్యానికి వెన్నెముక అయిన వైశ్య సమాజానికి మద్దతుగా నిలుస్తాను అని రాహుల్ అన్నారు.



