– మరో 40 ఏండ్లపాటు
– ఎన్డీఏనే అధికారంలో ఉంటుందని అమిత్‌షా ఎలా తెలుసు
– ఓటు వేసే హక్కును కోల్పోతే, రాజ్యాంగాన్ని రక్షించుకోలేం : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
పాట్నా: గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లు చోరీ చేసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటి తేదీని ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కు బదులు బీజేపీనే నిర్ణయిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి జరుగుతున్న యత్నాలపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ఓటరు అధికార యాత్ర’లో భాగంగా బీహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 40 ఏండ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్‌షా అన్నారని.. ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు. ఈ విధంగా ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చని ఎద్దేవా చేశారు. కొన్నేండ్ల క్రితం గుజరాత్ ఎన్నికల్లో మొదలైన ఈ ఓట్ల చోరీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరకు వచ్చిందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కచ్చితంగా ఎన్నికల తేదీలను మారుస్తారని ఆరోపించారు. వీటిని ఎవరూ ప్రశ్నించకుండా, ఎన్ని అక్రమాలు జరిగినప్పటికీ ఎన్నికల కమిషన్‌పై కేసు నమోదు చేయకుండా చట్టం తీసుకొచ్చారని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కొత్త ఓటర్లు వచ్చారో అక్కడ బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. బీహార్ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి ఎంత దూరమైనా వెళ్తుందన్నారు. ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించలేదు..అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని అన్నారు. ఇప్పుడు మనం ఓటు హక్కును కోల్పోతే..రాజ్యాంగాన్ని ఎన్నటికీ రక్షించుకోలేమని తెలిపారు. ” నేను అబద్ధం చెప్పడం లేదు. నా వద్ద నిజాలు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతాను. ఈ ఓట్‌చోరీపై ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రధాని మోడీ, అమిత్ షా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దొంగ ఎప్పుడూ నిశబ్ధంగానే ఉంటాడు ఎందుకంటే దొంగతనం చేశానని అతడికి తెలుసు. రాజ్యాంగం లేకపోతే కనీసం రైతులు కూడా ఏం చేయలేరు. ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ త్రివర్ణ పతాకం ముందు సెల్యూట్ చేసేది కాదు. ఇప్పుడు చేస్తోంది కానీ, లోపల మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతోంది” అని రాహుల్ అన్నారు.
రాహుల్ పోరాటానికి బాసటగా సీఎం రేవంత్‌రెడ్డి..
ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. బీహార్‌లో మంగళవారం జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రేవంత్ రెడ్డి , ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్ తదితరులు బీహార్‌లోని సుపాల్‌లో యాత్రలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ,ఇండియా బ్లాక్‌కు చెందిన ఇతర ప్రతినిధులు వాహనంపై ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ప్రయాణమార్గంలో ప్రజలకు స్వాగతం పలుకుతూ చేతులు ఊపారు.
ఎన్నికల తేదీని బీజేపీయే నిర్ణయిస్తుంది
- Advertisement -
- Advertisement -