– మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ఆదివాసీల హత్య అమానుషం
– కాళేశ్వరం అవినీతి వివరాలను అఖిలపక్షం ముందుంచాలి
– రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి
– మే 1 నుంచి 8 వరకు మే డే ఉత్సవాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అడవుల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకే మావోయిస్టు ల పేర ఆపరేషన్ ‘కగార్’తో అమాయకులైన ఆదివాసీలను హత్య చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులు కోరుకుంటున్న విధంగా వారితో శాంతిచర్చలు జరపాలన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కర్రెగుట్ట ప్రాంతం నుంచి కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణల వివరాలను అఖిలపక్ష పార్టీల ముందుంచాల న్నారు. అధికారుల నివేదికలు బయట పెట్టాలన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మహిళలను అగౌరవపరిచే విధంగా అందాల పోటీలు నిర్వహించేందుకు ఆరాటపడుతోందని విమర్శించారు. రైతుల ధాన్యాన్ని వెంటనే తూకం వేస్తూ డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని కోరారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి రాచకొండ ఎత్తిపోతల పథకం చేపట్టి చౌటుప్పల్, నారాయణపురం మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. మే ఒకటి నుంచి 8 వరకు మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే పనిలో ఉందని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరందించడంలో గత, ప్రస్తుత పాలకు లు విఫలం చెందారని విమర్శించారు. జిల్లాకు మూడు వైపులా గోదావరి, కృష్ణ, మూసీ వంటి జీవనదులున్నా నీటి సమస్యను పరిష్కరించడం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గానికి బస్వాపురం, పాలమూరు రంగారెడ్డి నుంచి, శివన్నగూడెం ప్రాజెక్టు ద్వారా నీళ్లందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి హీరో అవుతారో.. అమలు చేయకుండా జీరో అవుతారో తేల్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసచారి, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, సీనియర్ నాయకులు దోనూరు నర్సిరెడ్డి, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, చింతకాయల నర్సింహ పాల్గొన్నారు.
గట్టుప్పల్‌లో అమరుల సంస్మరణ సభ
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన అమరుల సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొని ప్రసంగించారు. అమరవీరుల చిత్రపటాలకు పలువురు నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఉమ్మడి చండూరు మండలంలో పార్టీ కోసం పనిచేసి అమరులైన 136 మంది కార్యకర్తలు, నాయకుల సంస్మరణ సభ నిర్వహించినందుకు గట్టుప్పల్ మండలం కమిటీని జాన్‌వెస్లీ అభినందించారు.
సీీపీఐ(ఎం)లో చేరిక
గట్టుప్పల్ మండలం అంతంపేట, గట్టుప్పల్, తేరటిపల్లి, చండూరు మండలం నెర్మట, మునుగోడు మండలం కొరటికల్, కలువలపల్లి, కృష్ణాపురం గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు వివిధ పార్టీలను వీడి సీపీఐ(ఎం)లో చేరాయి. పార్టీలో చేరిన వారికి జాన్‌వెస్లీ, జూలకంటి రంగారెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.