నవతెలంగాణ – న్యూఢిల్లీ : బీజేపీ పతనం ప్రారంభమైందని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిర్దోషిగా విడుదలైన అనంతరం ఆయన ఆదివారం జంతర్ మంతర్‌లో ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ అవినీతిపరుడు అని, బీజేపీ పతనం ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మిత్రులారా.. ఇది జంతర్‌మంతర్. ఇక్కడి నుండే ప్రజలు కాంగ్రెస్‌ను తరిమికొట్టారు. జంతర్‌మంతర్‌కి ఈరోజు చారిత్రాత్మక రోజు కానుంది. నేటి తారీఖును గుర్తుంచుకోండి. నేటి నుండే బిజెపి పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది” అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని మోడీచర్యలు తీసుకోరు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అవినీతిలో పాలుపంచుకుంటున్నారు లేదా ఆయన పార్టీ సభ్యులు లేదా స్నేహితులు భారీ స్కామ్‌లలో భాగస్వాములై ఉన్నారు. నేను అవినీతిపరుడిని కాదు. మోడీ అవినీతి చేస్తున్నారు” అని మండిపడ్డారు.
తాను పదేళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నానని, ప్రధాని మోడీ తనపై ఎన్ని దాడులు చేశారో తనకు తెలియదని, అయితే ఒక్క పైసా అవినీతిని కూడా కనుగొనలేదని అన్నారు. ”పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేను చాలా ఫైళ్లపై సంతకాలు చేశాను. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఒక కాంట్రాక్టర్ లేచి నిలబడి కేజ్రీవాల్ నన్ను డబ్బు అడిగారు అని చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తాను” అని అన్నారు. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చి తీర్పుపై ప్రజలను అభినందించాలనుకుంటున్నానని అన్నారు. గత నాలుగేళ్లుగా, మోడీ, అమిత్‌షాలు కుట్రతో ఢిల్లీ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఢిల్లీ కోర్టు మోడీజీ మీరు అబద్ధం చెబుతున్నారు. కేజ్రీవాల్ నిజాయితీ పరుడని అన్నారు.
”ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో ప్రభుత్వంగా చేశారు. నేడు బ్యాంకులు, రైల్వేలు, విద్య, ఆస్పత్రులు, గ్రామాలు, ప్రతిరంగం, అన్నీ 12ఏళ్లలో నాశనమయ్యాయి. నేడు మొత్తం ఉత్తరభారతదేశంలో శ్వాసతీసుకోవడం కూడా కష్టంగా మారుతోంది. వాయుకాలుష్య సమస్యను పరిష్కరించలేకపోయారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం సంగతి సరే .. కనీసం జీవించదగిన భారతదేశాన్ని అయినా తయారుచేయండి” అని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.



