నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీలో నెలకొన్న నాయకత్వ లోపం, అసమర్థ పాలన వల్లనే అన్ని రకాలుగా అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పాలనలో ఉదాసీనత పెరిగిపోవడం మూలంగానే గుజరాత్‌లో వంతెన కూలడం, అంతకుముందు అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం వంటి విషాద ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత ఇలాగే కొనసాగితే సమయం వచ్చినపుడు ప్రజలే తగిన గుణపాఠ చెబుతారని ఖర్గె సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బుధవారం గుజరాత్‌లోని వడోదర జిల్లాలోని గంభీర వంతెనలో ప్రధాన భాగం కూలిపోవడంతో 15 మంది చనిపోయారు. గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖర్గే వరుస ప్రమాద ఘటనలపై స్పందించారు. దేశంలో ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. రైలు ప్రమాదాలు, వంతెనలు కూలిపోవడం, విమాన ప్రమాదాలు ఇలా వరుసగా ప్రజల్లో బీజేపీ పాలన అంటే భయం పెరుగుతోంది. తాజాగా వంతెన కూలిన ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాయి. 12 మంది వరకు చనిపోవడం విషాదం. ప్రమాదానికి మూడేళ్ల నుంచే వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, మరమ్మతులు చేయాలని చెప్పినప్పటికీ, చర్యలు తీసుకోలేదు. 2021 నుంచి ఇప్పటివరకు గుజరాత్‌లో ఏడు వంతెన ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఖర్గె పోస్ట్‌లో పేర్కొన్నారు.
పెరిగిన మృతుల సంఖ్య
గుజరాత్‌లోని వడోదరలో వంతెన కూలి వాహనాలు నదిలో పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం మరో నలుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మృతుల సంఖ్య 15కు చేరిందని అధికారులు వెల్లడించారు. ఇంకా మరో నలుగురి ఆచూకీ దొరకాల్సి ఉంది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ వెల్లడించింది.