నవతెలంగాణ కాజీపేట : మహిళా సమానత్వం, స్త్రీ విముక్తి కోసం అనేక రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత(65) సోమవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. హన్మకొండలోని గోపాల్ పుర్లోని తన స్నేహితురాలి ఇంట్లో ఆమె కన్నుమూశారు. రజిత బాల్యం నుంచే ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రముఖ రచయితల ప్రసంగాలకు ఆకర్షితురాలై రచనలు చేయడం ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు.
2017లో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం ప్రదానం చేసింది. ఆమె 1973 లో ‘చైతన్యం పడ గెత్తింది’ అనే రచనతో మొదలైన ఆమె సాహిత్య ప్రయాణం 500కి పైగా కవితలు, 109 వ్యాసాలు, 38 పాటలు రచించారు. ఇరవైకి పైగా పురస్కారాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేశారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఎదురుగా ఉన్న ప్రొ. కాత్యాయనీ విద్మహే ఇంటి వద్ద సాహిత్యకారులు, మిత్రుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం మరణానికి ముందే ఆమె నిర్ణయించుకున్న విధంగా తన దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. ఆమె తన కండ్లను కూడా దానం చేశారు.