నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ రావటం తీవ్ర కలకలం సృష్టించింది. టెంపులో బాంబు పెట్టినట్లు అధికారులకు మంగళవారం ఈమెయిల్స్ వచ్చింది. ఈ తరహా ఈ మెయిల్స్ రావడంతో ఇది రెండోసారి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టెంపుల్ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ బెదిరింపు మెయిల్‌పై శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ(SGPC) ఆ రాష్ట్ర సీఎంతో పాటు డీజీపికి లేఖ రాసింది. ఆగంతకులను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయానికి అదనపు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.
ఇదిలా వుండగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రముఖ స్కూళ్లలో, విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లుగా తరచూ బెదిరింపులకు పాల్పడుతూ ఈమొయిల్స్ రావటం ఎక్కువయ్యాయి. ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (BSE) భవనానికి బాంబు పెట్టినట్లు అధికారులకు మంగళవారం కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు దేశ రాజధానిలోని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లకు, సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఖాళీ చేయించి.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) అధికారిక నివాసానికి సైతం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే.